E20 ethanol Myths : E20 పెట్రోల్ అద్భుతం.. ఆహా.. ఓహో అంటున్న ప్రభుత్వం.. అవన్నీ నమ్మొద్దని విజ్ఞప్తి!

E20 ethanol Myths : E20పై భయం ఎందుకు? అంటూ వైరల్ పుకార్లకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. సోషల్ మీడియాలో వ్యాపించే ప్రచారాలను నమ్మొద్దని సూచించింది. ఈ20 ఇంధనానికి సంబంధించి వస్తున్న వార్తలను ఒక్కొక్కటిగా ఖండించింది.

E20 ethanol Myths

  • ప్రస్తుతం E25 పెట్రోల్‌ను ప్రవేశపెట్టే ప్రతిపాదన ఏదీ లేదు
  • పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదు
  • రెండున్నర సంవత్సరాలుగా వాడుకలో ఇథనాల్ మిశ్రమ ఇంధనం
  • E25 పెట్రోల్‌ షెడ్యూల్ చేశారన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం ఖండన

E20 ethanol Myths : నిజంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలిపితే దేశానికి ప్రమాదమా? కార్లు, బైకు ఇంజిన్లు వెంటనే పాడవుతాయా? వేల లీటర్ల నీరు వృథా అవుతుందా? నీటి సమస్య ఎదురువుతుందా? ఆహార కొరత ఏర్పడుతుందా? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ పుకార్లతో వాహనదారుల్లో తీవ్ర ఆందోళన రేకిత్తిస్తున్నాయి.

కానీ, ఈ వాదనలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం గట్టిగానే సమాధానం ఇచ్చింది. E20 ఇంధనంపై వైరల్ అవుతున్న అనేక ప్రచారాలకు చెక్ పెట్టింది. E20పై భయం వద్దని సూచిస్తూ శాస్త్రీయ ఆధారాలు, పరిశోధనలు, పరీక్షల వివరాలను బయటపెట్టింది.

ఈ క్రమంలోనే పెట్రోల్‌లో 20 శాతం వరకు ఇథనాల్‌ను కలిపే E20 ఇంధన మిశ్రమ కార్యక్రమంపై వైరల్ అవుతున్న పుకార్లు, అపోహలను కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఖండించింది. ఇంజిన్ నష్టం నుంచి నీటి వినియోగం వరకు, పర్యావరణ సమస్యల నుంచి ఇంధన భద్రత వరకు వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పింది.

E25పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు :
E25 పెట్రోల్‌ను విడుదల చేశారనే వార్తలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. ‘ఇది పూర్తిగా అబద్ధం. పరీక్షలు ఇంకా జరుగుతుండగా E25ను ఎలా షెడ్యూల్ చేయగలరు?’ అని తెలిపాయి. ప్రస్తుతం E25 పెట్రోల్‌ను ప్రవేశపెట్టే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది.

ఇంజిన్‌లు దెబ్బతింటాయా? :
E20 ఇంధనం వాడితే వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయనే ప్రచారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నిర్వహించిన పరీక్షలను ప్రస్తావించింది. ప్యాసింజర్ వాహనాల్లో సుమారు 40 వేల కిలోమీటర్లు, టూవీలర్ వాహనాల్లో 20 వేల కిలోమీటర్లకు పైగా ట్రయల్స్ నిర్వహించినట్టు తెలిపింది.

ఈ పరీక్షల్లో వాహనాల డ్రైవబిలిటీ, పర్ఫార్మెన్స్ లేదా ఇంధన సామర్థ్యంలో పెద్దగా నెగిటివ్ ఎఫెక్ట్ కనిపించలేదని పేర్కొంది. మైలేజీలో మార్పు ఉంటే చాలా స్వల్ప స్థాయిలో మాత్రమేనని తెలిపింది. అంతేకాదు.. E20 కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలు ఇథనాల్‌లోని హై ఆక్టేన్ వాల్యూతో ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని పేర్కొంది.

20 కోట్లకు పైగా టీవీలర్ వాహనాల్లో ఈ20 పెట్రోల్ :
దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల పెట్రోల్ టూవీలర్ వాహనాలు, సుమారు 20 లక్షల పెట్రోల్ ఫోర్ వీలర్ వాహనాల్లో ఇప్పటికే ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను వాడుతున్నాయని పేర్కొంది. వాహన తయారీదారులు, ఇంధన సంస్థలు, పరిశ్రమ నిపుణులతో సాంకేతిక అధ్యయనాల తర్వాతే ప్రస్తుత ఇథనాల్ మిశ్రమ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

E20 కారణంగా ఇంజిన్ తుప్పు పడుతుందా? :
ఇథనాల్ కారణంగా ఇంజిన్ భాగాలు, లోహాలు, ప్లాస్టిక్ భాగాలు దెబ్బతింటాయనే ప్రచారాన్ని కూడా కేంద్రం ఖండించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్‌తో కలిసి ఏఆర్ఏఐ చేసిన అధ్యయనాలను ప్రభుత్వం ప్రస్తావించింది.

ఈ అధ్యయనాల్లో మోడ్రాన్ వాహనాల్లో వాడే లోహ, ప్లాస్టిక్ భాగాలకు ఎలాంటి తుప్పు సమస్యలు లేవని తెలిపింది. అయితే, పాత వాహనాల్లోని కొన్ని రబ్బరు భాగాలను ముందుగా మార్చాల్సిన అవసరం రావచ్చని పేర్కొంది.

Read Also :  Diesel isobutanol : E20 అయిపోయింది.. ఇప్పుడు మళ్లీ ఇంకోటి వచ్చింది.. ఇప్పుడు డీజిల్లో కలుపుతారట.. అదేంటంటే..!

వారంటీ, ఇన్సూరెన్స్ పోతుందా? :
E20 పెట్రోల్ వాడితే వాహన వారంటీ, బీమా చెల్లదన్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. E20 కోసం తయారైన వాహనాలు, వెహికల్ రెగ్యులర్ వారంటీ, బీమా నిబంధనల పరిధిలోనే ఉంటాయని వాహన తయారీ సంస్థలు, బీమా సంస్థలు స్పష్టం చేసినట్లు తెలిపింది. ఈ ప్రచారం కేవలం తప్పుదోవ పట్టించేలా ఉందని తెలిపింది.

లీటర్ ఇథనాల్‌కు 10 వేల లీటర్ల నీరు.. నిజమేనా? :
ఈ20 ఇథనాల్ తయారీకి భారీగా నీరు అవసరమంటూ ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక లీటర్ ఇథనాల్‌కు 10 వేల లీటర్ల నీరు అవసరమన్న వాదన వాస్తవం కాదని కేంద్రం స్పష్టం చేసింది.

ఇథనాల్ డిస్టిలరీలు ప్రస్తుతం ప్రతి లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి సుమారు 3 నుంచి 5 లీటర్ల శుద్ధి చేసిన నీటిని మాత్రమే వినియోగిస్తున్నాయని తెలిపింది. అంతేకాకుండా చాలా ప్లాంట్లు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (ZLD) విధానంలో పనిచేస్తూ నీటిని రీసైకిల్ చేస్తున్నాయని వివరించింది.

బియ్యం, మొక్కజొన్నతో నీళ్ల సమస్య పెరుగుతుందా? :
ఇథనాల్ తయారీ కోసం ఆహార భద్రతకు అవసరమైన ధాన్యాన్ని మళ్లించడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జాతీయ అవసరాలను తీర్చాకే మిగిలిన ఆమోదిత బియ్యాన్ని మాత్రమే వాడుతున్నామని తెలిపింది. ప్రస్తుతం ఇథనాల్ సరఫరాలో కీలకంగా వాడే మొక్కజొన్నకు వరితో పోలిస్తే తక్కువ నీటి అవసరం ఉంటుందని పేర్కొంది.

E20 కొత్త ప్రయోగం కాదు :
E20 అనేది పరీక్షించని ఇంధనంగా ప్రచారం చేయడంపై కేంద్రం తప్పుబట్టింది. ప్రపంచంలోని అనేక దేశాలు దశాబ్దాలుగా ఇథనాల్ మిశ్రమ ఇంధనాలను వాడుతున్నాయని తెలిపింది. అమెరికా, బ్రెజిల్, కెనడా, థాయ్‌లాండ్, జపాన్, యూరప్‌లోని పలు దేశాలు వివిధ స్థాయిల్లో ఇథనాల్ మిశ్రమాలను అమలు చేస్తున్నాయని తెలిపింది.

చీమలు, తేనెటీగలు వస్తాయా? ప్రభుత్వం క్లారిటీ :
E20లో చక్కెర కారణంగా చీమలు, తేనెటీగలు ఆకర్షితమవుతున్నాయని వచ్చిన సోషల్ మీడియా వార్తలను కూడా కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇంధన స్థాయి ఇథనాల్ తయారీ సమయంలోనే స్వేదన ప్రక్రియ ద్వారా చక్కెరలను తొలగిస్తారని, అవసరమైన డీనాచురెంట్లు కలిపి ఇంధన వినియోగానికి అనుకూలంగా మారుస్తారని స్పష్టం చేసింది.

E20పై ప్రయోగం వ్యాఖ్యలకూ కేంద్రం ఆన్సర్ :
E20 కార్యక్రమం అనేది ప్రభుత్వం చేయబోయే ప్రయోగమనే ప్రచారాన్ని కూడా కేంద్రం తీవ్రంగా ఖండించింది. సుప్రీంకోర్టు ముందు జరిగిన విచారణ ఇథనాల్ సేకరణకు సంబంధించిన ఒప్పంద నిబంధనలపై మాత్రమేనని తెలిపింది.

ఇథనాల్ మిశ్రమ ఇంధనం శాస్త్రీయతపై కాదని స్పష్టం చేసింది. అటార్నీ జనరల్ కార్యాలయం ఇచ్చిన వివరణను కూడా ప్రభుత్వం ప్రస్తావించింది. దీనిపై వచ్చిన కొన్ని మీడియా కథనాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంది.

పర్యావరణంపై ప్రభుత్వం లెక్కలివే :
ఇథనాల్ ప్లాంట్లు తప్పనిసరిగా పర్యావరణ అనుమతులు పొందాలి. భూగర్భ జల నిబంధనలు పాటించాలి. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్రమాణాలకు లోబడి ఉండాలని కేంద్రం తెలిపింది. 2014-15 నుంచి ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం ద్వారా రూ. 1.9 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయింది. రైతులకు రూ. 1.6 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు చేసింది. సుమారు 930 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాల తగ్గాయి. 310 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ముడి చమురు దిగుమతులు తగ్గాయి.

పుకార్లకు బ్రేక్.. E20పై పూర్తి క్లారిటీ :
E20పై వాహనదారుల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, తప్పుదారి పట్టించే ప్రచారాలే దీనికి కారణమని కేంద్రం చెబుతోంది. ఇంజిన్ భద్రత నుంచి పర్యావరణం వరకు అన్ని అంశాలను పరిశీలించాకే ఇథనాల్ అమల్లోకి తేస్తామని క్లారిటీ ఇచ్చింది. అప్పటివరకూ E20 ఇంధనం కోసం తయారైన వాహనాల్లోనే ఈ ఇంధనాన్ని వాడటం బెటర్. పాత వాహనాల విషయంలో తయారీదారుల సూచనలు తప్పక పాటించడం వాహనదారులు చేయాల్సి పని.

ఇంధన మార్పు అంటే.. జస్ట్ పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం కాదు.. దేశ ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గించే ప్రయత్నమని కేంద్రం చెబుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో వచ్చే ప్రతిది నిజమని నమ్మొద్దని, శాస్త్రీయ ఆధారాలను పరిశీలించాలని సూచిస్తోంది.