e-commerce Rules : ఈ-కామర్స్‌కు కేంద్రం బిగ్ షాక్.. ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇక మాయలు కుదరవు.. కొత్త రూల్స్ ఇవే!

e-commerce Rules : ఈ-కామర్స్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ధరల పారదర్శకత నుంచి డార్క్ ప్యాటర్న్‌ల అరికట్టడం వరకు అనేక కీలక మార్పులను వివరించింది. పూర్తి వివరాలివే..

E-Commerce Rules

  • ధరలు దాచిపెడితే కుదరదు.. డార్క్ ప్యాటర్న్స్‌కు చెక్
  • ఆన్‌లైన్ షాపింగ్‌లో ‘మాయాజాలం’కు చెక్.. కీలక మార్పులు
  • ఆన్‌లైన్ కొనుగోళ్లలో ఇక ఆటలు సాగవు.. నిబంధనలు కఠినతరం
  • ఈ-కామర్స్‌లో ఇక పారదర్శకతే.. ధరలపై కేంద్రం స్ట్రిక్ట్ రూల్స్

E-Commerce Rules : ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక అలర్ట్.. ఇక ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ధరల విషయంలో మరింత పారదర్శకత ఉండేలా కొత్త నిబంధనలను కఠినతరం చేసింది. ముఖ్యంగా కస్టమర్లను గందరగోళానికి గురిచేసే ‘డార్క్ ప్యాటర్న్స్‌’కు చెక్ పెట్టేలా కేంద్రం చర్యలు తీసుకుంది.

ఆఫర్లు, డిస్కౌంట్లు, ధరలను చూపించి మాయమాటలకు ఇక అవకాశం లేకుండా నిబంధనలు మారనున్నాయి. ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేసే ముందు కస్టమర్లు తప్పక తెలుసుకోవాల్సిన ఈ కీలక మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అమల్లోకి ఎప్పుడంటే? :
వినియోగదారుల రక్షణ (ఇ-కామర్స్) (సవరణ) నిబంధనలు 2026ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ సవరించిన నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

డిస్కౌంట్లు, ధరల తగ్గింపులు :

ఏదైనా వస్తువుపై డిస్కౌంట్ ప్రకటిస్తే.. ప్రస్తుత తగ్గింపు ధరతో పాటు గత ధరను కూడా ప్లాట్‌ఫారమ్ చూపించాలి. గత ధర అంటే.. డిస్కౌంట్ ప్రకటించడానికి ముందు 30 రోజుల్లో ఆ వస్తువు లేదా సర్వీస్‌కు ఉన్న అత్యల్ప ధర.. తద్వారా నిజంగా ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో వినియోగదారులు ఈజీగా తెలుసుకోవచ్చు.

సెర్చ్ రిజల్ట్స్ :
వినియోగదారులు ఏదైనా వస్తువు కోసం సెర్చ్ చేసినప్పుడు వారిని తప్పుదారి పట్టించేలా రిజల్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లు మార్చకూడదు. సెర్చ్ రిజల్ట్స్‌ను కావాలనే మార్చి కొన్ని ప్రొడక్టులకు అనవసరమైన ప్రాయారిటీ ఇవ్వడం లేదా వినియోగదారులకు నష్టం కలిగించడం పూర్తిగా నిషేధం. అంటే వినియోగదారుల సెర్చ్‌కు సంబంధించిన రిజల్ట్స్ న్యాయంగా, పారదర్శకంగా తప్పనిసరిగా ఉండాలి.

స్పాన్సర్డ్ లిస్టింగ్స్ :
డబ్బు చెల్లించి లేదా స్పాన్సర్ చేసి సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించే ఉత్పత్తులను స్పష్టంగా గుర్తించాలి. అవి సాధారణ సెర్చ్ రిజల్ట్స్ కాదని వినియోగదారులకు సులభంగా అర్థమయ్యేలా స్పష్టమైన ప్రకటన లేదా లేబుల్ ఉండాలి. దీంతో పెయిడ్ ప్రమోషన్, సాధారణ సెర్చ్ రిజల్ట్ మధ్య తేడాను వినియోగదారులు వెంటనే గుర్తించవచ్చు.

డార్క్ ప్యాటర్న్స్ :

వినియోగదారులను మోసం చేయడం లేదా వారికి అవసరం లేని వస్తువును అంటగట్టేలా చేసే డార్క్ ప్యాటర్న్స్‌ను ఇ-కామర్స్ సంస్థలు వాడకూడదు. 2023లో జారీ చేసిన డార్క్ ప్యాటర్న్స్‌కు సంబంధించిన మార్గదర్శకాలను సంస్థలు పాటించాలి. ప్రతి సంవత్సరం స్వయంగా ఆడిట్ నిర్వహించాలి. అలాగే నిబంధనలు పాటిస్తున్నామని తెలిపే కంప్లయెన్స్ సర్టిఫికేట్‌ను కూడా వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ఉంచాలి.

వినియోగదారుల ఫిర్యాదులు :
వినియోగదారు ఫిర్యాదు చేసినప్పుడు ఆ ఫిర్యాదును సంస్థ ఫిర్యాదుల అధికారి రిజిస్టర్ చేసి దాని కాపీని ఫిర్యాదుదారునికి ఇవ్వాలి. తద్వారా వినియోగదారు తన ఫిర్యాదు అధికారికంగా రిజిస్టర్ అయిందని తెలుసుకోవచ్చు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉండేలా ప్రభుత్వం ఈ కీలక మార్పులను తీసుకొచ్చింది.

కస్టమర్ హెల్ప్‌లైన్ :
ప్రతి ఇ-కామర్స్ సంస్థ జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (NCH)తో ఇంటిగ్రేషన్ ప్రక్రియలో భాగస్వామి కావాలి. 2025లో NCHకు వచ్చిన మొత్తం ఫిర్యాదుల్లో ఇ-కామర్స్ రంగానికి సంబంధించిన ఫిర్యాదులు గణనీయంగా పెరిగాయి. దాంతో వినియోగదారులు ఆన్‌లైన్ కొనుగోళ్లకు సంబంధించిన సమస్యలను మరింత ఈజీగా ఫిర్యాదు చేసి పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది.

Read Also : Apple iPhone 17 Series : భారత్‌లో ఐఫోన్ 17 ధరల మోత.. ఈ మోడల్స్ కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందేనా?

ప్రొడక్ట్ డీలర్ సమాచారం :
వస్తువును కొనే ముందు వినియోగదారులకు అవసరమైన ముఖ్యమైన వివరాలను ప్లాట్‌ఫారమ్‌లు క్లియర్ గా అందించాలి. బెస్ట్ బిఫోర్, యూజ్ బిఫోర్ తేదీ, రిటర్న్-రిఫండ్ నిబంధనలు, వారంటీ, డెలివరీ, పేమెంట్ వంటి వివరాలు కూడా ఇందులో కనిపించాలి. వస్తువును కొనేముందు వాటి పూర్తి సమాచారం తెలుసుకుని వినియోగదారులు అది కొనాలో వద్దో నిర్ణయం తీసుకునే వీలుంటుంది.

దిగుమతి చేసుకున్న వస్తువులు :
విదేశాల నుంచి దిగుమతి చేసిన వస్తువులను విక్రయించే సమయంలో వాటికి సంబంధించిన వివరాలను వినియోగదారులకు వెల్లడించాలి. ముఖ్యంగా వస్తువును దిగుమతి చేసిన సంస్థ లేదా వ్యక్తి వివరాలు, ఆ వస్తువు ఏ దేశానికి చెందినదో కూడా స్పష్టంగా తెలియజేయాలి. తద్వారా వినియోగదారులు ఉత్పత్తి ఎక్కడిది, దిగుమతిదారు ఎవరు అనే విషయాలను ముందుగానే తెలుసుకోవచ్చు.

యూజర్ల డేటా వినియోగం :
వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా ఇ-కామర్స్ సంస్థలు వినియోగించరాదు. డేటాను ఏ ప్రయోజనం కోసం సేకరిస్తున్నారు? ఎలా వాడుతున్నారో స్పష్టంగా తెలియజేయాలి. అవసరమైన చోట యూజర్ల అనుమతి తీసుకోవాలి. దీంతో వినియోగదారుల వ్యక్తిగత సమాచారం అనవసరంగా, ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు.

బండిల్ ఫీజులు :
ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌కు నేరుగా సంబంధం లేని ఇతర సర్వీసులకు సంబంధించి వినియోగదారులపై అదనపు బండిల్ ఫీజులు విధించకూడదు. అయితే, లాయల్టీ లేదా మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన నిబంధనలకు మినహాయింపులు ఉంటాయి. తద్వారా వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువు లేదా సర్వీస్‌కు సంబంధం లేని అదనపు ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం ఉండదు.