Green SM Cabs : ఓలా, ఊబర్‌, ర్యాపిడోకు షాక్.. హైదరాబాద్‌లో కొత్త CAB సర్వీస్ ఎంట్రీ.. కిలోమీటర్‌కు రూ.9 మాత్రమే!

Green SM Cabs : హైదరాబాద్‌లోకి వియత్నాంకు చెందిన గ్రీన్ SM ఎలక్ట్రిక్ క్యాబ్ సర్వీస్ ఎంట్రీ ఇచ్చింది. కిలోమీటర్‌కు రూ.9 ప్రారంభ ధరతో ఓలా, ఊబర్‌కు పోటీగా నిలుస్తున్న ఈ కొత్త క్యాబ్ సేవల పూర్తి వివరాలు తెలుసుకోండి.

Green SM Cabs

  • క్యాబ్ బుక్ చేసే వారికి గుడ్ న్యూస్
  • హైదరాబాద్ రోడ్లపైకి కొత్త కంపెనీ
  • కిలోమీటర్‌కు రూ.9కే ఎలక్ట్రిక్ క్యాబ్ జర్నీ
  • హైదరాబాద్‌లోకి వియత్నాం క్యాబ్ కంపెనీ

Green SM Cabs : హైదరాబాద్‌లో క్యాబ్ బుక్ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఆఫీస్‌కు వెళ్లాలన్నా, ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలన్నా ఛార్జీలు చూస్తేనే చాలామందికి బడ్జెట్ గుర్తొస్తుంది.

ఇలాంటి సమయంలో సిటీలోకి కొత్త క్యాబ్ సర్వీస్ అడుగుపెట్టింది. అదే వియత్నాంకు చెందిన గ్రీన్ ఎస్ఎమ్ సర్వీసు.. కిలోమీటర్‌కు కేవలం రూ.9 ప్రారంభ ధరతో ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దీంతో హైదరాబాద్ క్యాబ్ మార్కెట్‌లో కొత్త పోటీ మొదలైంది..

ఓలా, ఊబర్‌కు గట్టి పోటీ :
ఇప్పటివరకు హైదరాబాద్‌లో క్యాబ్ సర్వీస్ అంటే ఎక్కువగా ఓలా, ఊబర్ పేర్లే గుర్తొచ్చేవి. మధ్యలో రాపిడో కూడా తనదైన మార్కెట్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు గ్రీన్ ఎస్ఎమ్ ఎంట్రీతో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. తక్కువ ధరకు ఎలక్ట్రిక్ కార్లలో ప్రయాణించే అవకాశం ఉండటంతో ప్రయాణికుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది.

ఈ గ్రీన్ SM ఎవరిది? :
గ్రీన్ ఎస్ఎమ్ వెనుక ఉన్నది వియత్నాంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఫామ్ నట్ వాంగ్. ఆయన ఆధ్వర్యంలోని విన్‌గ్రూప్ అనుబంధ సంస్థ విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తుంది. ఆ కార్లతోనే గ్రీన్ SM క్యాబ్ సేవలు అందిస్తోంది. అంతేకాదు, వి-గ్రీన్ పేరుతో ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను కూడా డెవలప్ చేస్తోంది.

Read Also : El Nino Health Emergency: దేశ ప్రజలకు హెచ్చరిక.. ఇండియాలో హెల్త్ ఎమర్జెన్సీ.. డబ్ల్యూహెచ్‌వో చెప్పింది ఇదే..

రూ.9కే ఎలా సాధ్యం? :
ఈ కంపెనీ వ్యాపార విధానం మిగతా క్యాబ్ సంస్థలతో పోలిస్తే.. కాస్త భిన్నంగా ఉంటుంది. సొంత కార్లను ఉపయోగించడం, డ్రైవర్లను నేరుగా ఉద్యోగులుగా నియమించుకోవడం, సొంత ఛార్జింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఖర్చులు తగ్గించుకుంటోంది. డ్రైవర్లకు నెలకు సుమారు రూ.30 వేల జీతం ఇచ్చే విధానాన్ని కూడా అమలు చేస్తోంది..

డ్రైవర్లకు కొత్త కష్టాలా? :
హైదరాబాద్‌లో సుమారు 3,500 నుంచి 3,600 వాహనాలతో కార్యకలాపాలు ప్రారంభించారు. అయితే, ఈ కొత్త పోటీ లోకల్ క్యాబ్, ఆటో డ్రైవర్లలో ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే ఆదాయం తగ్గుతోందని, మరో పెద్ద కంపెనీ రావడంతో తమ ఉపాధిపై మరింత ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.

ప్రయాణికులకు తక్కువ ధరలు, మెరుగైన సేవలు అందే అవకాశం ఉన్నా స్థానిక డ్రైవర్ల జీవనోపాధి కూడా కీలకమే. మొత్తానికి గ్రీన్ ఎస్ఎమ్ ఎంట్రీతో హైదరాబాద్ క్యాబ్ మార్కెట్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు చూద్దాం..