India Richest Temples : భారత్‌లో టాప్ 10 సంపన్న దేవాలయాలివే.. తిరుపతిలో రూ. 2.26 లక్షల కోట్ల నుంచి పద్మనాభస్వామి ఖజానా వరకు!

India Richest Temples : ఆలయ నికర విలువ అనేది ప్రతి ఏడాదిలో లక్షలాది భక్తులు ఇచ్చే విరాళాల నుంచే కాదు.. శతాబ్దాలుగా పొగేసిన బంగారం, భూమి, పెట్టుబడులు, ఇతర ఆస్తుల నుంచి కూడా వస్తుంది. దేశంలో అత్యంత సంపన్నమైన ఆలయాలేంటో ఇప్పుడు చూద్దాం..

India Richest Temples

  • భారత్‌లో అత్యంత సంపన్న దేవాలయాల జాబితా
  • తిరుపతి ఆలయం నికర విలువ రూ. 2.26 లక్షల కోట్లు
  • సంపన్న ఆలయాలపై అధికారిక ర్యాంకింగ్‌ ప్రకటన లేదు
  • ఏ ఆలయానికి ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తుందంటే?

India Richest Temples : భారత్‌లో అత్యంత సంపన్నమైన ఆలయం ఏంటో తెలుసా? దేశంలో మొత్తం ఎన్ని సంపన్న ఆలయాలు ఉన్నాయి. అందులో ఏ ఆలయానికి ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తుంది. ఏయే రూపాల్లో ఆలయ సంపద పెరుగుతుందో తెలుసా?

వాస్తవానికి, ఏదైనా ఒక ఆలయానికి వేల కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, ఆభరణాలు, వందల ఎకరాల భూములు, బ్యాంకుల్లో భారీ (India Richest Temples) డిపాజిట్లు ఉంటాయి. ఎందుకంటే.. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు హుండీ కానుకల్లో సమర్పిస్తుంటారు. శతాబ్దాలుగా రాజులు, చక్రవర్తులు, సామాన్య భక్తులు సమర్పించిన అమూల్య నిధులన్నీ కలిపి కొన్ని భారతీయ ఆలయాలను ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనవి నిలిచాయి.

ఈ ఆలయాల వైభవం కేవలం గోపురాల ఎత్తు, భక్తుల సంఖ్యలో కాదు.. ఆలయాల ఖజానాల్లో దాగిన అపారమైన సంపదలో కూడా కనిపిస్తుంది. బంగారం, వజ్రాభరణాలు, నగదు నిల్వలు, వేల ఎకరాల భూములు, కోట్ల రూపాయల పెట్టుబడులు… ఇలా ఊహకు అందని ఆస్తులను ఈ దేవాలయ ట్రస్టులు నిర్వహిస్తున్నాయి.

కానీ, భారత ప్రభుత్వం దేశంలోని అత్యంత సంపన్న ఆలయాలపై అధికారిక ర్యాంకింగ్‌ను ప్రకటించలేదు. అయినప్పటికీ ట్రస్ట్ వార్షిక నివేదికలు, కోర్టు పత్రాలు, ఆర్థిక లెక్కలు, బహిరంగంగా అందుబాటులో ఉన్న విశ్వసనీయ సమాచారంతో ఈ ఆలయాల ఆర్థిక నికర విలువ వివరాలను అంచనా వేయొచ్చు.

అయితే… దేశంలో అత్యంత సంపన్నమైన దేవాలయం ఏది? ఏ ఆలయ ఖజానాలో అత్యధిక బంగారం ఉంది? ఏ దేవాలయానికి వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి? ఇప్పుడు బహిరంగంగా అందుబాటులో ఉన్న తాజా ఆర్థిక వివరాలు, వార్షిక ఆదాయం, ట్రస్ట్ ఆస్తులు, సంపద అంచనాల ఆధారంగా అత్యంత సంపన్న దేవాలయాల గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. తిరుమల వెంకటేశ్వర దేవాలయం (ఆంధ్రప్రదేశ్)
నికర ఆస్తి విలువ : రూ. 2.26 లక్షల కోట్లు (టీటీడీ శ్వేతపత్రం)
వార్షిక ఆదాయం : రూ. 5,100 కోట్లకు పైగా
వార్షిక విరాళాలు : సుమారు రూ. 1,500 కోట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారత్ లోనే అత్యంత సంపన్నమైన ఆలయ ట్రస్ట్. లేటెస్ట్ టీటీడీ శ్వేతపత్రం ప్రకారం.. ఈ ట్రస్ట్ బంగారు నిల్వలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, భూములు, పెట్టుబడులతో సహా సుమారు రూ. 2.26 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ ఆలయానికి ఏటా రూ. 1,500 కోట్లకు పైగా విరాళాలు అందుతాయి. ప్రతి ఏడాది 3 కోట్లకు పైగా భక్తులు వస్తారు.

2. శ్రీ పద్మనాభస్వామి ఆలయం (కేరళ) :
ట్రెజర్ వాల్యూ : రూ. 1.2 లక్షల కోట్లకు పైగా అంచనా
వార్షిక విరాళాలు : అధికారికంగా తెలియదు

తిరువనంతపురంలోని ఈ ఆలయం భూగర్భంలో భారీగా నిధి ఉంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయంగా చెప్పవచ్చు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జరిపిన జాబితాలో రూ. 1.2 లక్షల కోట్లకు పైగా విలువైన బంగారు విగ్రహాలు, వజ్రాలు, పురాతన నాణేలు, ఆభరణాలు ఉన్నట్లు వెల్లడైంది. రహస్యమైన వాల్ట్ బి ఇంకా ఓపెన్ కాలేదు. అంటే.. అసలు ఖజానా వాల్యూ ఇంకా ఎక్కువగా ఉండవచ్చు.

3. షిర్డీ సాయిబాబా ఆలయం (మహారాష్ట్ర) :
అంచనా ఆస్తులు : రూ. 2,500 నుంచి రూ. 3,000 కోట్లు
వార్షిక ఆదాయం : రూ. 400 నుంచి రూ. 700 కోట్లు

భారత్‌లో అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటైన షిర్డీ సాయిబాబా టెంపుల్ ట్రస్ట్, వేల కోట్ల రూపాయల బ్యాంకు డిపాజిట్లు, బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. మతపరంగా ఈ ట్రస్ట్ ఆసుపత్రులు, విద్యా సంస్థలు, అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా భారీగా నిధులు పొందుతుంది.

4. గురువాయూర్ దేవాలయం (కేరళ) :
ఆస్తులు : రూ. 1,700–2,500 కోట్లు (అంచనా)
వార్షిక ఆదాయం : రూ. 250 నుంచి రూ. 400 కోట్లు

‘దక్షిణ ద్వారక’గా గురువాయూర్ దేవాలయం చాలా ఫేమెస్.. విరాళాలు, పెట్టుబడులు, బంగారు నిల్వల ద్వారా భారీ మొత్తంలో సంపదను కూడగట్టింది. గురువాయూర్ దేవస్థానం వివిధ సేవా, సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.

Read Also : Motorola Edge 70 Max : మోటోరోలా మజాకా.. ఈ నెల 15న కొత్త మోటో 70Max వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు లీక్..

5. శ్రీమాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం (జమ్మూ- కాశ్మీర్) :
రూ. 2వేల కోట్లకు పైగా ఆస్తులు (అంచనా)
2023–24 ఆర్థిక సంవత్సర ఆదాయం : రూ. 683 కోట్లు
కానుకలు, విరాళాలు : రూ. 255 కోట్లు

శ్రీమాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు నిర్వహించే ఈ పుణ్యక్షేత్రానికి ప్రతి ఏటా లక్షలాది మంది యాత్రికులు వస్తుంటారు. ఈ ఆలయం ఆదాయం విరాళాలు, వసతి సౌకర్యాలు, హెలికాప్టర్ సర్వీసులు, యాత్రా సంబంధిత కార్యకలాపాల నుంచి భారీగా ఆదాయం వస్తుంది.

6. సిద్ధివినాయక దేవాలయం (మహారాష్ట్ర) :
అంచనా ఆస్తుల విలువ రూ. 500 కోట్లకు పైగా
వార్షిక ఆదాయం : సుమారు రూ. 100 నుంచి రూ. 130 కోట్లు

ముంబైలోని సిద్ధివినాయక ఆలయం దేశంలోని అత్యంత సంపన్న దేవాలయాలలో ఒకటి. ప్రముఖులు, వ్యాపార నేతలతో సహా భారత్ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ దేవాలయ ట్రస్ట్ ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక సంక్షేమంపై కూడా భారీగా ఖర్చు చేస్తుంటారు.

భారత్‌లో ఇతర అత్యంత సంపన్న దేవాలయాలివే :
దేశంలో ఇతర అత్యంత సంపన్నమైన దేవాలయాల విషయానికి వస్తే.. అమృత్‌సర్‌లోని (పంజాబ్) స్వర్ణ దేవాలయం ఒకటి.. ఈ ఆలయం నికర మొత్తం ఆస్తుల విలువ అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ, ఏటా వందల కోట్ల రూపాయల విరాళాలు అందుకుంటుంది.

వారణాసిలోని (ఉత్తర ప్రదేశ్) కాశీ విశ్వనాథ దేవాలయం అంచనా ఆస్తుల విలువ రూ. 500 కోట్లకు పైగా ఉంది. పూరీలోని (ఒడిశా) జగన్నాథ దేవాలయం వేలాది ఎకరాల భూమి, విలువైన ఆభరణాలు, ఇతర ఆస్తులు ఉన్నాయి. అయితే అధికారిక విలువ తెలియదు. ప్రభాస్ పటన్‌లోని (గుజరాత్) సోమనాథ దేవాలయం అంచనా ఆస్తుల విలువ వందల కోట్లు ఉంటుంది.

అలాగే, ప్రారంభం నుంచి రూ.3,500 కోట్లకు పైగా విరాళాలు అందుకున్న అయోధ్య రామ్ మందిర్ (ఉత్తర ప్రదేశ్) మొత్తం నికర విలువను వెల్లడించలేదు. విస్తారమైన బంగారు ఆభరణాలు, దానాలకు పేరొందిన మీనాక్షి అమ్మన్ ఆలయం మదురై (తమిళనాడు)లో ఉంది.

యాత్రా కాలంలో రూ. 300 కోట్లకు పైగా వార్షిక వసూళ్లతో దేశంలోనే అత్యధిక ఆదాయం సంపాదించే పుణ్యక్షేత్రాలలో ఒకటైన శబరిమల అయ్యప్ప ఆలయం పతనంతిట్ట (కేరళ)లో ఉంది. ఉజ్జయిన్ (మధ్యప్రదేశ్)లోని మహాకాలేశ్వర ఆలయం ప్రతి ఏటా పదుల కోట్ల రూపాయల విరాళాలు అందుకుంటోంది.