EPFO
EPFO: ఒకప్పుడు ఉద్యోగులకు భవిష్య నిధి డబ్బుల ఉపసంహరణ పెద్ద తలనొప్పిగా ఉండేది. ఫామ్‌లు నింపడం, ఈపీఎఫ్ఓ కార్యాలయాల చుట్టూ తిరగడం, మాన్యువల్ తనిఖీలు, వారాల తరబడి ఎదురుచూపులు వంటి పరిస్థితులు ఎదురయ్యేవి.
కాలక్రమంలో ఈపీఎఫ్ఓ భవిష్య నిధి ఉపసంహరణ నిబంధనల్లో మార్పులు చేసింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ డిజిటల్‌గా వేగవంతంగా జరుగుతోంది.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ 3.0 కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ నాటికి ప్రత్యేక మొబైల్ యాప్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ యాప్ ద్వారా ఉద్యోగులు యూపీఐను ఉపయోగించి భవిష్య నిధి డబ్బును తక్షణమే ఉపసంహరించుకోగలుగుతారు. బ్యాంకులు అందించే సౌలభ్యం, వేగానికి సమానంగా ఈపీఎఫ్ఓ సేవలు మారనున్నాయి.
ఇంతకుముందు వరకు భవిష్య నిధి ఉపసంహరణ అంటే ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తులు సమర్పించడం వంటి ప్రక్రియలు ఉండేవి. రికార్డుల్లో ఏ చిన్న పొరపాటు ఉన్నా చెల్లింపులు నిరవధికంగా ఆలస్యం అయ్యేవి. పదవీ విరమణ పొందినవారు, ఉద్యోగ మార్పులు చేసినవారికి అత్యవసర సమయంలో డబ్బులు తీసుకోవడానికి చాలా కాలం పాలు వేచి చూడాల్సి వచ్చేది.
ఈపీఎఫ్ఓ ఈ ప్రక్రియను క్రమంగా సులభం చేసింది. యూఏఎన్ విధానం, ఆన్‌లైన్ క్లెయిమ్‌లు, ఆపై ఉమాంగ్ యాప్ ప్రవేశంతో దరఖాస్తుల పని తగ్గింది. అయినా వేగవంతమైన ఆటో సెటిల్‌మెంట్ విధానంలోనూ సభ్యులు క్లెయిమ్ దాఖలు చేసి పరిష్కారం పొందే వరకు ఎదురు చూడాల్సి వచ్చేది. రాబోయే యూపీఐ ఆధారిత యాప్ ఉద్యోగులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనుంది.
Also Read: Municipal Elections: 2 జేబులూ నిండిపోయేంత డబ్బు పంచుతున్నారు.. ప్రతి ఇంటికీ అర తులం బంగారం ఆఫర్
కొత్త ఈపీఎఫ్ఓ యాప్ తీసుకురానున్న మార్పులు
ఉమాంగ్ యాప్‌కు భిన్నంగా కొత్త ఈపీఎఫ్ఓ యాప్ ఉంటుంది. ఇది పూర్తిగా భవిష్య నిధి సేవలపై దృష్టి పెడుతుంది. యాప్ ప్రారంభమైన తర్వాత సభ్యులు ఈ సదుపాయాలు పొందగలుగుతారు.
పూర్తి స్థాయి ప్రారంభానికి ముందు సాంకేతిక లోపాలు తొలగించేందుకు, లావాదేవీల భద్రతను నిర్ధారించుకునేందుకు 100 డమ్మీ ఖాతాలతో ఈ వ్యవస్థను ప్రస్తుతం పరీక్షిస్తున్నారు.