Bank Locker Guidelines ( Image credit to Gemini AI )
Gold Bank Locker : మీ బంగారం బ్యాంకు లాకర్‌లో దాచారా? పెళ్లి కోసం కొనుగోలు చేసిన బంగారాన్ని భద్రంగా ఉంటుందని బ్యాంకు లాకర్లలో పెడదామని అనుకుంటున్నారా? అయితే, ఈ వార్త మీకోసమే.. ఎన్నో దశాబ్దాలుగా భారతీయ కుటుంబాలు బంగారం వంటి విలువైన వస్తువులను భద్రపరిచేందుకు ఎక్కువగా బ్యాంక్ లాకర్లను వినియోగిస్తున్నాయి.
అయితే, ఇందులో పెళ్లి ఆభరణాలు, వారసత్వ నగలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు బ్యాంకు లాకర్లలో పెడితే భద్రంగా ఉంటాయని భావిస్తుంటారు. కానీ, ఇటీవల దేశంలో కొన్ని చోట్ల కస్టమర్లు దాచుకున్న బ్యాంకు లాకర్లలోని వస్తువులు అదృశ్యమైనట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో ఈ బ్యాంకు లాకర్లు ఎంతవరకు సురక్షితమో అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
ఢిల్లీలోని కీర్తి నగర్‌కు చెందిన మహిళ తన బ్యాంకు లాకర్ నుంచి దాదాపు రూ.60 లక్షల విలువైన ఆభరణాలు మాయమయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్నోలోని ఒక బ్రాంచ్‌లో 4 లాకర్లను పగలగొట్టి రూ.48 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అలాగే, ఫరీదాబాద్ నుంచి మరో ఫిర్యాదు కూడా వచ్చింది. ఒక చార్టర్డ్ అకౌంటెంట్, ఆయన ఫ్యామిలీకి సంబంధించిన దాదాపు కిలో బంగారం, 3 కిలోల వెండి ఆభరణాలు కనిపించకుండా పోయినట్టు గుర్తించారు.
వారి లాకర్‌ను ఎవరో తెరిచి ఆభరణాలను కాజేసినట్టు బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఏడాది ప్రారంభంలో లక్నోలో నేషనల్ బ్యాంకులోని లాకర్ నుంచి సుమారు రూ.1.5 కోట్ల విలువైన ఆభరణాలు దొంగిలించినట్టు, ఇందులో బ్యాంకు సిబ్బంది ప్రమేయం కూడా ఉందని కస్టమర్ ఆరోపించారు.
దాంతో బెంగళూరులో నేషనల్ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాలక్రమేణా లాకర్ల నుంచి సుమారు 2.7 కిలోల బంగారు ఆభరణాలను దొంగిలించి, ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం తాకట్టు పెట్టాడని ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. ఇలాంటి ఘటనలతో బ్యాంకు లాకర్లలో కూడా తమ వస్తువులకు భద్రత లేదని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్, సహజ్ మనీ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ ప్రకారం.. ఇంట్లో విలువైన వస్తువులను దాచడంతో పోలిస్తే బ్యాంక్ లాకర్లకే ఎక్కువ భద్రతా ఉంటుందని అంటున్నారు. అయితే, లాకర్ల లోపల దాచిన ప్రతిదానికీ బ్యాంకులే బాధ్యత వహిస్తాయని వినియోగదారులు భావించకూడదు. ప్రధానంగా బ్యాంకు లాకర్లు అనేవి ఇంట్లో దొంగతనం నుంచి కొంతవరకు రక్షణ అందిస్తాయి.
కానీ, ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు లాకర్‌లో ఉంచిన విలువైన వస్తువులకు పూర్తిగా బీమా ఇచ్చే సంస్థలు మాత్రం కావు వారి బాధ్యత ఇక్కడ పరిమితంగానే ఉంటుంది. అందుకే ఏదైనా నష్టం జరిగినప్పుడు కస్టమర్లు పూర్తి పరిహారం పొందలేరు. ఆర్థిక, చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆర్బీఐ లాకర్ నిబంధనల్లో మార్పులేంటి? :
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) 2022లో బ్యాంకు లాకర్ నిబంధనల్లో కొన్ని కీలక మార్పులు చేసింది. అందులో కస్టమర్ల భద్రత చర్యలకు సంబంధించి ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇప్పుడు కొత్త లాకర్ అగ్రమెంట్ తప్పనిసరి. అలాగే లాకర్ భద్రత కోసం కొన్ని నియమాలు కూడా ప్రవేశపెట్టింది. ఇకపై కస్టమర్ లాకర్ ఓపెన్ చేసినప్పుడల్లా SMS లేదా ఇమెయిల్ అలర్ట్ వస్తుంది.
బ్యాంకులు సీసీటీవీ ఫుటేజ్‌ను కనీసం 180 రోజులు స్టోర్ ఉంచాలి. ఎలక్ట్రానిక్ లాకర్లు అయితే స్ట్రాంగ్ సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ పాటించాలి. అలాగే, బ్యాంక్ నిర్లక్ష్యం వల్ల దొంగతనం, అగ్నిప్రమాదం, ఉద్యోగుల మోసం వంటి నష్టం వాటిల్లితే బ్యాంక్ దీనికి బాధ్యత వహించాలి అని ఆర్బీఐ కొత్త నిబంధనలు సూచిస్తున్నాయి.
బ్యాంకు లాకర్ భద్రతకు సంబంధించి బ్యాంకు, కస్టమర్ మధ్య ఉమ్మడిగా బాధ్యత ఉంటుందని నిపుణులు అంటున్నారు. బ్యాంకు లాకర్ సంబంధించి బ్యాంకు జవాబుదారీగా ఉంటుంది. అలాగే కస్టమర్ లాకర్ విషయాలు, అందులో దాచిన వస్తువులు, లాకర్ కీకి సంబంధించి బాధ్యత వహిస్తాడు” అని నివేదికలో పేర్కొన్నారు.
బ్యాంకు లాకర్‌లో నిషేధిత వస్తువులు అసలు పెట్టకూడదు. అలాగే లాకర్ యాక్సెస్ వివరాలను కూడా చాలా సురక్షితంగా ఉంచుకోవాలి. ఈ విషయంలో కస్టమర్‌నే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
విలువైన వస్తువులు పోతే ఏమవుతుంది? :
బ్యాంకు లాకర్లలో ఏదైనా వస్తువు మిస్ అయితే వినియోగదారుడికి పరిహారం ఎప్పుడు వర్తిస్తుందో కూడా ఆర్బీఐ నియమాల్లో పేర్కొంది. బ్యాంకు నిర్లక్ష్యం లేదా అగ్నిప్రమాదం, దొంగతనం లేదా బ్యాంకు సిబ్బంది మోసం వంటి ఘటనల కారణంగా నష్టం జరిగితే కస్టమర్ పరిహారం పొందేందుకు అర్హులు.
ఇలాంటి సందర్భాలలో బ్యాంకు బాధ్యత లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు పరిమితం చేసింది. “వరదలు లేదా భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలకు సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను పాటిస్తే బ్యాంకులు సాధారణంగా బాధ్యత వహించవు.