Jio BP Petrol Price : వాహనదారులకు బిగ్ షాక్.. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంపు!
Jio-BP Petrol Price Hike : రిలయన్స్ జియో - బీపీ (Jio-bp) పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసింది.
- Harish Thanniru
- Updated on- October 13, 2026 / 02:59 PM IST
Jio Bp Petrol Price Hike
Jio-BP Petrol Price Hike : వరుస పండుగల వేళ వాహనదారులకు బిగ్ షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఇటీవలే ప్రముఖ ప్రైవేట్ ఆయిల్ రిటైల్ కంపెనీ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచగా.. ఇప్పుడు అదేదారిలో రిలయన్స్ జియో -బీపీ (Jio-bp) సైతం ధరలను పెంచేసింది. లీటర్ పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.3 చొప్పున పెంపు చేసింది. పెంచిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చినట్లు సంస్థ పేర్కొంది. ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ జీయో-బీపీకి దేశవ్యాప్తంగా 2,304 పెట్రోల్ బంకులు ఉన్నట్లు సమాచారం.
Also Read – Gold-Silver Prices Today : పండుగ వేళ మహిళలకు ఊరట.. తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం రేటు ఎంతంటే?
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, ఇంధన సరఫరాకు సంబంధించిన అంతర్జాతీయ పరిణామాలు ఈ ధరల పెంపునకు కారణాలుగా చెబుతున్నారు. ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థలు ధరలను పెంచుతుండగా.. ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం మాత్రం సాధారణ ఇంధన ధరల్లో మార్పులు చేయలేదు.
తాజాగా పెరిగిన ధరల వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని జియో-బీపీ పెట్రోల్ బంకుల్లో ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.73, లీటర్ డీజిల్ రూ.103.82గా ఉన్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.25 కాగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.96గా ఉన్నాయి.
ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లో ధరలను పరిశీలిస్తే.. హరియాణాలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.80గా ఉండగా.. లీటర్ డీజిల్ రూ.98.65గా ఉంది. పంజాబ్ రాష్ట్రంలోని పలు నగరాల్లో జియో -బీపీ బంకుల్లో పెట్రోల్ లీటర్ రూ.110.27కాగా.. లీటర్ డీజిల్ రూ.99.19గా ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని బంకుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.91 నుంచి రూ. 117.68 మధ్య ఉన్నాయి. లీటర్ డీజిల్ ధర రూ.97.15 నుంచి రూ. 100.81 మధ్య ఉన్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే వ్యక్తిగత వాహనదారుల ప్రయాణ ఖర్చులతో పాటు రవాణా రంగంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా డీజిల్‌పై ఆధారపడే సరకు రవాణా వాహనాల నిర్వహణ ఖర్చులు పెరిగితే, కొన్ని వస్తువుల ధరలపైనా ప్రభావం చూపవచ్చు. ప్రస్తుతానికి పలు ప్రైవేట్ సంస్థ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ధరలను పెంపుచేస్తే వాహనదారులపై భారం పెరగడంతోపాటు.. పలు వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు.
