Loan Guarantor Rules : మీ స్నేహితుడి లోన్‌కు గ్యారంటీ ఇచ్చే ముందు జాగ్రత్త.. ఆ అప్పు మీ మెడకు చుట్టుకోవచ్చు!

Loan Guarantor Rules : స్నేహితులు, బంధువులు, తెలిసినవాళ్ల లోన్లకు మీరు గ్యారంటీ సంతకం పెడుతున్నారా? రుణగ్రహీత అప్పు చెల్లించకపోతే అది మీరే కట్టాల్సి రావొచ్చు.. లోన్ గ్యారంటీ విషయంలో ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి..

Loan Guarantor Rules

  • ఇతరుల లోన్‌కు గ్యారంటీగా మీ సంతకం పెడుతున్నారా?
  • అప్పు తీర్చాల్సిన బాధ్యత మీపైనా పడుతుంది జాగ్రత్త
  • లోన్ గ్యారంటీ విషయంలో ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి

Loan Guarantor Rules : మనకు తెలిసిన వాళ్లు, స్నేహితులు, బంధువులు అప్పు తీసుకునేటప్పుడు గ్యారంటీ సంతకం అడగడం చాలా కామన్.. ఫ్రెండ్ కాదా? బంధువులే కదా? అని తొందరపడి హామీగా నిలబడొద్దు..

వాళ్లతో ఉన్న పరిచయం, నమ్మకంతో చాలామంది ఆలోచించకుండా అడిగిన చోట సంతకం పెట్టేస్తుంటారు. కానీ, ఒక్కసారి గ్యారంటీ ఇచ్చిన తర్వాత పరిస్థితులు మారితే మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి రావచ్చు. అసలు లోన్‌కు హామీదారుగా ఉంటే ఎలాంటి రూల్స్ ఉంటాయో తెలుసా? అవేంటో పూర్తి వివరాలతో తెలుసుకుందాం..

బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్ వంటి రుణాలు ఇచ్చేటప్పుడు కొన్ని సందర్భాల్లో గ్యారంటీదారుడిని అడుగుతాయి. రుణగ్రహీత తిరిగి చెల్లించలేని పరిస్థితి వస్తే.. ఆ మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు హామీదారుడిని కూడా సంప్రదిస్తాయి..

అప్పు తీర్చకపోతే మీకే తిప్పలు :
భారతీయ ఒప్పందాల చట్టం 1872లోని సెక్షన్ 128 ప్రకారం.. ఒప్పందంలో వేరుగా పేర్కొనకపోతే రుణగ్రహీతకు ఉన్న బాధ్యతతో సమానమైన బాధ్యత గ్యారంటీదారుడికీ ఉంటుంది. అంటే.. ఆ అప్పు తీసుకున్న వ్యక్తి ఈఎంఐలు చెల్లించకపోతే బ్యాంకు మీ నుంచి కూడా బకాయిలు వసూలు చేయవచ్చు. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు..

Read Also : TVS Family Dispute : TVS కుటుంబంలో ఆస్తుల పంచాయితీ.. సమాన వాటా కోసం తండ్రికే లీగల్ నోటీసులు!

మీ సిబిల్ స్కోర్‌పైనా ప్రభావం :
మరో ముఖ్యమైన విషయం.. మీరు గ్యారంటీ ఇచ్చిన వ్యక్తి లోన్ చెల్లించకపోతే మీ క్రెడిట్ రిపోర్టుపైనా నెగిటివ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో మీరు సొంతంగా హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి..

సంతకం చేసే ముందు ఇవి తప్పనిసరి :
ఎవరికైనా గ్యారంటీ ఇచ్చే ముందు వారి ఆదాయం, ఉద్యోగం, ఇప్పటికే ఉన్న అప్పులు, ఈఎంఐలు ఎలా చెల్లిస్తున్నారో తెలుసుకోండి. రుణ ఒప్పందంలోని నిబంధనలు పూర్తిగా చదవండి.. మీరు ఎంతవరకు బాధ్యత వహించాలో స్పష్టంగా తెలుసుకోండి. స్నేహం కోసం పెట్టిన ఒక సంతకం భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితిని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు..