June Financial Rules : జూన్ 1 నుంచి కొత్త ఫైనాన్షియల్ రూల్స్.. UPI, ATM, LPG ధరల్లో భారీ మార్పులు.. సామాన్యుడి జేబుకు చిల్లే!

Financial Rules June 2026 : వచ్చే నెల జూన్ 1 నుంచి కొత్త ఆర్థిక పరంగా 9 నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఎల్పీజీ నుంచి యూపీఐ, ఏటీఎం వరకు భారీ మార్పులు జరగనున్నాయి. పూర్తి వివరాలివే

June Financial Rules ( Image Credit : AI )

  • జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఫైనాన్షియల్ రూల్స్ 
  • యూపీఐ, ఏటీఎం, ఎల్పీజీ ధరల్లో భారీగా మార్పులు
  • పాన్ కార్డు, సోలార్ ప్యానెళ్ల నిబంధనల్లో కూడా మారొచ్చు
  • రెపో రేటుకు సంబంధించి కీలక నిర్ణయం ఉండొచ్చు

June Financial Rules : మే నెల ముగుస్తోంది. జూన్ నెల వచ్చేస్తోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెల కూడా దేశంలో అనేక ఆర్థికపరమైన కీలక మార్పులు రానున్నాయి. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. వంటగది నుంచి బ్యాంకు డిపాజిట్ల వరకు ప్రతిదానిపై ప్రభావం పడనుంది.

అంతేకాదు.. ప్రతి ఇంటిపైనా, ప్రతి జేబుపైనా పడుతుంది. ఈ మార్పులలో ఎల్పీజీ సిలిండర్ ధరల (Financial Rules June 2026) నుంచి ఎఫ్‌డీ వడ్డీ రేట్ల వరకు అన్నింటిపై ప్రభావం ఉంటుంది. అలాగే, సోలార్ ప్యానెల్ ధరలు కూడా పెరగవచ్చు. జూన్ నుంచి అమల్లోకి వచ్చే 9 ప్రధాన మార్పులను ఇప్పుడు పరిశీలిద్దాం..

యూపీఐ పేమెంట్లు :
యూపీఐ మోసాలను నివారించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త సిస్టమ్ అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ వ్యవస్థ కింద క్యూఆర్ కోడ్, మొబైల్ నంబర్ లేదా ఫేక్ పేరుకు బదులుగా అసలైన లబ్ధిదారుని వెరిఫై చేసిన పేరు మాత్రమే కనిపిస్తుంది. తద్వారా మోసాలు జరగడం, తప్పుడు ఖాతాకు డబ్బులు పంపడం వంటివి తగ్గుతాయి.

ఎల్పీజీ సిలిండర్ ధరలు :
చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన కొత్త వంటగ్యాస్ ధరలను ప్రకటిస్తాయి. జూన్ ఒకటో తేదీన కూడా కొత్త ధరలను ప్రకటించనున్నాయి. ఇరాన్ యుద్ధం సరఫరా గొలుసుపై ప్రభావం చూపింది. ముడి చమురు, ఎల్‌పీజీ రెండింటికీ కొరత ఉంది. ధరలు పెరిగితే వంట బడ్జెట్‌ కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం, ఢిల్లీలో 14 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ రూ. 913కు లభిస్తుండగా, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ రూ. 2,078కు లభిస్తోంది.

ఏటీఎఫ్ ధరలు :
చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరను కూడా సవరిస్తాయి. ఈ ధరలో ఏవైనా హెచ్చుతగ్గులు ఉంటే విమాన ప్రయాణికులపై నేరుగా ప్రభావం చూపుతాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వల్ల కూడా ఈ ధరలపై ప్రభావం పడింది. ప్రస్తుతం ఢిల్లీలో జెట్ ఫ్యూయల్ ధర కిలోలీటరుకు రూ. 104,927గా ఉంది.

Read Also : Bank Holidays June 2026 : మీకు జూన్‌లో బ్యాంకు పని ఉందా? ఈ నెలలో 11 రోజులు సెలవులు.. ఆర్బీఐ హాలిడే ఫుల్ లిస్ట్!

పాన్ కార్డు నిబంధనలు :
ఆదాయపు పన్ను శాఖ జూన్ ఒకటో తేదీ నుంచి పాన్‌కు సంబంధించిన కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. ఈ నిబంధనల ప్రకారం.. కొన్ని లావాదేవీలకు ఇకపై పాన్ అవసరం ఉండదు. ఉదాహరణకు.. ఒకే రోజులో రూ. 50,000 దాటిన డిపాజిట్లకు ఇకపై పాన్ అవసరం లేదు. అదే సమయంలో హై వాల్యూ లావాదేవీలకు పాన్ కార్డు అవసరాన్ని మరింత కఠినతరం చేసింది.

ఏటీఎం కొత్త నిబంధనలు :
జూన్ ఒకటో తేదీ నుంచి ఏటీఎం క్యాష్ విత్‌డ్రా, బ్యాలెన్స్ చెకింగ్స్, మినీ-స్టేట్‌మెంట్ ఛార్జీలు పెరగనున్నాయి. బ్యాంకులు కొత్త లావాదేవీల విధానాలను ప్రవేశపెట్టాయి. తద్వారా సొంత ఏటీఎంల నుంచి నెలకు కేవలం 5 ఫ్రీ ట్రాన్సాక్షన్లు మాత్రమే అనుమతిస్తున్నాయి. మెట్రో నగరాల్లో, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి కేవలం 3 ఫ్రీ ట్రాన్సాక్షన్లు మాత్రమే అనుమతి ఉంటుంది.

సోలార్ ప్యానెళ్ల నిబంధనలు :
సూర్య ఘర్ యోజన కింద సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తోంది. జూన్ ఒకటో తేదీ నుంచి కొన్ని నిబంధనలు మారనున్నాయి. ఈ పథకం కింద సబ్సిడీ సోలార్ ప్యానెళ్ల కోసం ప్రభుత్వం ఆమోదించిన సోలార్ ప్యానెళ్లను మాత్రమే ఉపయోగించవచ్చు. అందుకే సోలార్ ప్యానెళ్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.

రేషన్ కార్డు :
ఢిల్లీ ప్రభుత్వం రేషన్ కార్డు నిబంధనలలో కీలక మార్పు చేసింది. రాజధానిలో నివసిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఉపశమనం లభించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కింద రేషన్ కార్డు పొందేందుకు వార్షిక ఆదాయ పరిమితిని రూ. 1.2 లక్షల నుండి రూ. 2.5 లక్షలకు పెంచే ప్రతిపాదనను ఢిల్లీ క్యాబినెట్ ఆమోదించింది. ఈ నిబంధన జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.

ఎఫ్‌డీ వడ్డీ రేట్లు మారవచ్చు :
అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉంది. అదనంగా, కొన్ని స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌లను కూడా నిలిపివేయవచ్చు. పలు కొత్త పథకాలను కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది.

HDFC బ్యాంకు నిబంధనలు :
జూన్ 1 నుంచి HDFC బ్యాంక్ కరెంట్ అకౌంట్లతో పాటు అనేక ఇతర అకౌంట్ల నిబంధనలను మారనున్నాయి. బ్యాంక్ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం.. వచ్చే నెల నుంచి చిన్న నోట్లు, నాణేల క్యాష్ డిపాజిట్లపై కొత్త పరిమితితో పాటు కొత్త ఛార్జీ కూడా వర్తిస్తుంది. ఇప్పటివరకు ఈ చిన్న నోట్ల క్యాష్ డిపాజిట్లపై నెలవారీ పరిమితి లేదు. కానీ, నోట్ల డిపాజిట్లపై సుమారు 4శాతం, నాణేల డిపాజిట్లపై సుమారు 5 శాతం ఛార్జీ విధించేవారు. ఇకపై అది మారుతోంది.

బ్యాంకు ప్రకారం.. కొత్త నిబంధనల కింద రూ. 20 లేదా అంతకంటే తక్కువ విలువ గల నోట్లపై నెలకు రూ. 10వేల పరిమితి ఉండగా, నాణేలపై నెలకు రూ. 5వేల పరిమితి ఉంది. ఈ పరిమితికి మించిన నగదు డిపాజిట్లపై అదనంగా 2శాతం ఛార్జీ విధిస్తారు. ఈ పరిమితిని దాటి అదనపు డిపాజిట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

జూన్‌లో జరగనున్న ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో రెపో రేటుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవచ్చు. తద్వారా మీ లోన్ ఈఎంఐపై ప్రభావం చూపవచ్చు.