UPI MDR Charges: యూపీఐ లావాదేవీలపై ఊరట.. ఎండీఆర్ ఛార్జీల అమలు వాయిదా?.. వ్యాపారులకు బిగ్ రిలీఫ్!
దేశవ్యాప్తంగా డిజిటల్(UPI MDR Charges) చెల్లింపుల రంగంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
- V Santhosh Kumar
- Updated on- October 8, 2026 / 02:21 PM IST
Mpi mdr charges implementation likely to be deferred to january 1
UPI MDR Charges: దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల రంగంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (UPI MDR Charges) విధించే నిర్ణయం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారం అక్టోబర్ 15వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ఛార్జీల అమలును వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ వరకు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాబోయే దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల సీజన్‌లో హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు ఆర్థిక ఊరట కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వ్యాపారుల నిరసనలకు దిగొచ్చిన ఎన్‌పీసీఐ.. రూ. 40 లక్షల టర్నోవర్‌కు మినహాయింపు?
యూపీఐపై ఎండీఆర్ ఛార్జీలను ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వ్యాపారులు ఇటీవల ‘నో యూపీఐ డే’ పేరిట భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. పండుగల సమయాన ఈ అదనపు రుసుములు భారం కావడమే కాకుండా వ్యాపార లావాదేవీలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎన్‌పీసీఐ (NPCI) నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీ పరిశీలన జరిపి అమలు తేదీని పొడిగించాలని భావిస్తోంది. అంతేకాకుండా, సంవత్సరానికి రూ. 40 లక్షల వరకు టర్నోవర్ కలిగిన చిన్న వ్యాపారాలకు ఎండీఆర్ నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
క్రాష్ అయిన స్టాక్ మార్కెట్.. తీవ్ర ఒత్తిడిలో పేటీఎం, మొబిక్విక్ షేర్లు:
ఎండీఆర్ వాయిదా వార్తలు వెలువడటమే ఆలస్యం.. భారత స్టాక్ మార్కెట్లో పేమెంట్ అగ్రిగేటర్ల షేర్లు విపరీతమైన పతనాన్ని చవిచూశాయి. యూపీఐ ఛార్జీల ద్వారా కొత్త ఆదాయం వస్తుందని ఆశించిన ఇన్వెస్టర్లలో నిరాశ వ్యక్తమవడంతో పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేరు ఏకంగా 10 శాతం క్షీణించి, సంస్థ మార్కెట్ క్యాప్ రూ. లక్ష కోట్ల దిగువకు చేరింది. అదేవిధంగా మొబిక్విక్ షేరు 8 శాతం, పైన్ ల్యాబ్స్ షేరు 4 శాతానికి పైగా నష్టాల్లో మునిగిపోయాయి.
