Onion Price Hike: కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిధర.. ఏడాదిలోనే 94 శాతం పెరుగుదల.. కిలో ఎంత ఉందో తెలుసా?
దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్లలో కిలో ఉల్లి ధరలు (Onion Price Hike)భారీగా పెరుగడంతో వంటింటి బడ్జెట్ తలకిందులవుతోంది.
- V Santhosh Kumar
- Published on- September 17, 2026 / 02:03 PM IST
Onion price hike soars to 70 rupees buffer stock release
- భగ్గుమంటున్న ఉల్లి ధరల
- కిలో డెబ్బై రూపాయలు
- రూ.35కే బఫర్ ఉల్లి
Onion Price Hike: భారతీయ వంటకాల్లో అత్యంత కీలకమైన ఉల్లిపాయ ధరలు సామాన్యుడికి మళ్లీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతుండటంతో వంటింటి బడ్జెట్ తలకిందులవుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఉల్లి సగటు చిల్లర ధర ఏకంగా 94 శాతం మేర పెరిగి రూ.53.84కు చేరడం గమనార్హం. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రూ.35కే అందిస్తున్నప్పటికీ, రవాణా, పంపిణీ సమస్యల వల్ల అది సామాన్య వినియోగదారులందరికీ పూర్తిగా అందుబాటులోకి రావడం లేదు.
రబీ-ఖరీఫ్ మధ్య కొరత.. పెరిగిన ధరల ఒత్తిడి:
ఉల్లి ధరల(Onion Price Hike) భగ్గుమనడానికి ప్రధానంగా కాలానుగుణ సరఫరా లోపమే కారణమని అధికారులు చెబుతున్నారు. రబీ సీజన్ నిల్వలు క్రమంగా తగ్గిపోవడం, కొత్త ఖరీఫ్ పంట మార్కెట్లకు రావడంలో ఆలస్యం కావడం వల్ల మార్కెట్‌లో కొరత ఏర్పడింది. నాసిక్, కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా సాగు ఆలస్యమై సరఫరాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దేశంలో ఉత్పత్తి సరిపడా ఉన్నప్పటికీ, పంపిణీ వ్యవస్థలో వ్యత్యాసాల కారణంగా బహిరంగ మార్కెట్‌లో రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి.
రూ.35కే బఫర్ స్టాక్ విక్రయం.. ఉపశమనం లభించేనా?
పెరిగిన ధరలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా నిల్వ ఉంచిన 1.21 లక్షల టన్నుల బఫర్ స్టాక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. NAFED, NCCF కేంద్రాలు, మొబైల్ వ్యాన్ల ద్వారా కిలో ఉల్లిని రూ.35కే విక్రయిస్తున్నారు. ‘కాండా ఎక్స్‌ప్రెస్’ రైళ్ల ద్వారా ఢిల్లీ, చెన్నై వంటి నగరాలకు సరఫరాను విస్తరించారు. త్వరలోనే కొత్త ఖరీఫ్ పంట మార్కెట్‌కు వస్తేనే ధరలు అదుపులోకి వచ్చి, వినియోగదారులకు పూర్తి స్థాయి ఉపశమనం లభించే అవకాశం ఉంది.
