PM Kisan 23rd Installment : పీఎం కిసాన్ పై కీలక అప్డేట్.. ఆ కార్డు లేదా.. అయితే మీకు డబ్బులు రావు..!

PM Kisan 23rd Installment : పీఎం కిసాన్ 23వ విడత డబ్బులు జమపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ సారి ఆ కార్డు ఉన్న వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేయనున్నారు.

pm kisan new rules unique farmer id compulsory for 23rd installment eligibility for farmers

  • పీఎం కిసాన్ పై బిగ్ అప్డేట్
  • అమల్లోకి కొత్త రూల్స్
  • ఆ కార్డు లేకపోతే డబ్బులు రావు

PM Kisan 23rd Installment : కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు పీఎం కిసాన్ పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తోంది. మార్చి 2026లో 22వ విడత పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం లబ్ధిదారులు 23వ విడత కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ నిధులకు సంబంధించి కొన్ని మార్పులు చేశారు. కొత్త నిబంధనలు అమలు చేయనున్నారు. ఈ క్రమంలో 23వ విడత పీఎం కిసాన్ నిధులు పొందాలనుకునే రైతులు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే.

పీఎం కిసాన్ పథకంలో పారదర్శకత పెంచేందుకు.. కేవలం అర్హులైన వారికి మాత్రమే నిధులు విడుదల చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం తాజాగా రైతు రిజిస్ట్రీ లేదా యూనిక్ ఫార్మర్ ఐడీని తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఈ నిబంధనను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 14 రాష్ట్రాల్లో కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్న రైతులు 23వ విడత సాయాన్ని పొందాలంటే.. ఈ ఐడీని కచ్చితంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

రైతు రిజిస్ట్రీ లేదా యూనిక్ ఫార్మర్ ఐడీ అనేది అన్నదాతలకు ఇచ్చే ఒక డిజిటల్ గుర్తింపు కార్డు లాంటిది. దీనిలో రైతులు తమ భూమి వివరాలు, పంటలకు సంబంధించిన సమాచారం, ఎరువుల వినియోగం, పోషణ చర్యలు, పశుపోషణ, ఆదాయానికి సంబంధించిన ఇతర కీలక వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల.. భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ పథకాల కోసం రైతులు మళ్లీ మళ్లీ డాక్యుమెంట్లు సమర్పించే అవసరం ఉండదు. అలానే విత్తనాలు, ఎరువుల సరఫరా, పంట బీమా క్లెయిమ్ వంటి సేవలను వేగవంతంగా పొందేందుకు అవకాశం లభించనుంది.

ఎలా నమోదు చేసుకోవాలి..

  • యూనిక్ ఫార్మర్ ఐడీ నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
  • రైతులు తమ రాష్ట్ర అధికారిక ‘అగ్రిస్టాక్’ పోర్టల్ లేదా వ్యవసాయ శాఖ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.
  • దీనికి ఆధార్ కార్డు, ఆధార్‌ నంబర్ తో లింక్ అయిన మొబైల్ నంబర్, భూమి పత్రాలు అవసరం.
  • వీటితో పాటు అదనంగా ఇ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

అన్నదాతలకు ఆర్థిక సాయం అందించేందుకు గాను కేంద్రం ప్రభుత్వం.. పీఎం-కిసాన్ పథకం తీసుకువచ్చింది. దీనిలో భాగంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2000 చొప్పున చెల్లింపులు చేస్తారు. ఈ క్రమంలో 23వ విడత 2026 జూన్ , జూలైలో విడుదల చేస్తారని సమాచారం. ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే, రైతులు ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మొత్తంగా కొత్త నిబంధనల ప్రకారం రైతులు 23వ విడత నిధుల జమ చేసే సమయానికి.. రైతు ఐడీ నమోదు చేసుకోవాలి. లేదంటే వచ్చే విడతలోని రూ. 2,000 సహాయం కోల్పోయే అవకాశం ఉన్నందున తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.