RBI 1 Hour Pause Rule : డిజిటల్ పేమెంట్స్ కోసం RBI కొత్త రూల్స్.. రూ.10 వేల కన్నా ఎక్కువ పంపాలంటే ఎదురు చూడక తప్పదు

RBI 1 Hour Pause rule : యూపీఐ పేమెంట్స్ కి సంబంధించి ఆర్బీఐ కొత్త రూల్స్ విడుదల చేసింది. పది వేలకు మించి నగదు బదిలీ చేయాలంటే గంట సేపు ఎదురు చూాడాల్సిందే.

RBI Proposes 1 Hour Pause For Above rs 10000 High Value UPI Payments

RBI 1 Hour Pause Rule : దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) అందుబాటులోకి వచ్చిన తర్వాత రూ.10 మొదలు లక్షల రూపాయల వరకు పెమెంట్లను స్మార్ట్ ఫోన్ ద్వారానే చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్న కొద్ది.. సైబర్ నేరాలు, డిజిటల్ చెల్లింపుల స్కామ్స్ కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గత ఐదు సంవత్సరాల్లో డిజిటల్ మోసాలు 10 రెట్లు పెరిగి.. 28 లక్షలకు చేరుకోవడం ప్రతి ఒక్కరిని కలవరపెడుతుంది. డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఆన్ లైన్ మోసాలు, స్కాములని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తెర మీదకు తెచ్చింది. యూపీఐతో పాటు ఇతర ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల విధానంలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఈ చర్యలతో పొరపాటున లేదా మోసపూరితంగా డబ్బులు ఇతరుల ఖాతాల్లోకి బదిలీ అయినట్లు గుర్తిస్తే వెనక్కి తీసుకునేందుకు అవకాశం లభించనుంది.

ప్రస్తుతం ఎవరికైనా యూపీఐ లేదా ఇతర డిజిటల్ పేమెంట్స్ పద్దతుల ద్వారా డబ్బులు పంపిస్తే.. వెంటనే క్షణాల వ్యవధిలోనే ఆ మొత్తం వారి ఖాతాల్లో క్రెడిట్ అవుతోంది. ఇది సైబర్ నేరగాళ్లు చక్కని అవకాశంగా మారింది. ఒక్కసారి డబ్బులు కట్ అయితే వాటిని తిరిగి పొందలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆర్‌బీఐ కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. రూ.10,000 మించి పంపించినప్పుడు ఖాతా నుంచి ఖాతాకు జరిగే బదిలీలపై ఒక గంట ఆలస్యం విధించనున్నారు. అంటే మీరు పంపించే డబ్బు వెంటనే మీ ఖాతా నుంచి కట్ అయి అవతలి వ్యక్తి ఖాతాలో జమ అవ్వదు. ఆ సమయంలో కస్టమర్ ఖాతా నుంచి తాత్కాలికంగా డెబిట్ అవుతుంది. ఒక వేళ పొరపాటున లేదా మోసపూరితంగా డబ్బు కట్ అయినట్లు తెలిస్తే ఆ గంట లోపు ట్రాన్సాక్షన్ రద్దు చేసుకునేందుకు అవకాశం లభించనుంది. పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలకే ఈ కొత్త రూల్స్ తీసుకురానున్నారు.

వృద్ధులు, దివ్యాంగుల భద్రత కోసం కూడా ఆర్‌బీఐ కొత్త నిబంధన తీసుకురానుంది.70 ఏళ్ల వయసు దాటిన వారు రూ.50 వేలకు మించి డబ్బులు పంపించినప్పుడు నమ్మకమైన వ్యక్తిఆమోదాన్ని తప్పనిసరి చేయాలని భావిస్తోంది. సైబర్ నేరగాళ్ల జాబితాలో ఎక్కువగా వయసు మళ్లినవారు, దివ్యాంగులు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు ఆర్‌బీఐ కిల్ స్విచ్ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చే ఆలోచనలోఉంది. ఫోన్ పోయినా, బ్యాంక్ ఖాతా హ్యాక్ అయినట్లు అనుమానం వచ్చినా కేవలం ఒక్క క్లిక్ తో మీ డిజిటల్ పేమెంట్ల పద్ధతులన్నింటినీ వెంటనే నిలిపివేసేందుకు ఈ కొత్త కిల్ స్విచ్ ఫీచర్ అవకాశం కల్పించనుంది. ఈ కొత్త ప్రతిపాదనలపై మే 8వ తేదీ వరకు అభిప్రాయాలు సేకరించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఆ తర్వాత అధికారికంగా అమలులోకి తీసుకురానున్నారు.