దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బీఐ, తాజాగా సేవింగ్స్ ఖాతాలపై నవంబర్ 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలు చేయబోతోంది. బ్యాంకులో ఖాతాలు ఉన్న డిపాజిట్ దారులపై ఇది ప్రభావం చూపనుంది.
సేవింగ్స్ ఎకౌంట్ లో రూ.1 లక్ష వరకు ఉన్న డిపాజిట్లపై ఇచ్చే 3.5 శాతం వడ్డీరేటును 3.25 శాతానికి తగ్గించనుంది. ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్‌లో రూ.1 లక్ష పైన డిపాజిట్లు ఉన్న కస్టమర్లు నవంబర్ 1 నుంచి పావు శాతం తక్కువ వడ్డీని పొందుతారు. బ్యాంకు దగ్గర కావాల్సినంత లిక్విడిటీ ఉండటంతో వడ్డీ రేట్లు తగ్గించాల్సి వచ్చిందని తెలిపింది. కొద్ది రోజుల క్రితమే ఎస్.బీ.ఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రెపో రేట్ తగ్గించిన తర్వాత ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం రెపో రేటు 5.15 శాతంగా ఉంది. దీంతో ఒకటి నుంచి రెండేళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5 శాతం ఉన్న వడ్డీని 6.4 శాతానికి తగ్గించింది ఎస్‌బీఐ. రూ.2 కోట్ల పైన ఉన్న డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది బ్యాంకు. గతంలో 1 నుంచి 2 ఏళ్లు రూ.2 కోట్ల పైన డిపాజిట్లు చేసిన వారికి 6.3 శాతం వడ్డీ ఇచ్చేది. కానీ ప్రస్తుతం 6 శాతం మాత్రమే వడ్డీ లభిస్తుంది. నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త వడ్డీ రేట్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఖాతాదారులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లోకి వెళ్లి చూడవచ్చును.