TVS Family Dispute : TVS కుటుంబంలో ఆస్తుల పంచాయితీ.. సమాన వాటా కోసం తండ్రికే లీగల్ నోటీసులు!
TVS Family Dispute : TVS కుటుంబంలో ఆస్తుల వివాదం తెరపైకి వచ్చింది. తండ్రి వేణు శ్రీనివాసన్‌కు లక్ష్మీ వేణు లీగల్ నోటీసులు పంపారు. కుటుంబ ఆస్తుల్లో సమాన వాటా కావాలని కోరుతున్నారు. మల్లికా శ్రీనివాసన్ కూడా కుమార్తెకు మద్దతు తెలిపారు.
- Sreehari A
- Published on- November 17, 2026 / 11:13 AM IST
TVS Family Dispute
- టీవీఎస్ కుటుంబంలో ఆస్తుల చిచ్చు..
- నాన్నకు షాక్ ఇచ్చిన కూతురు..
- ఆస్తుల పంపకాలపై కుమార్తె పోరాటం
- తండ్రి శ్రీనివాసన్‌కు లక్ష్మీ వేణు నోటీసులు
TVS Family Dispute : పెద్ద కుటుంబం.. భారీ వ్యాపార సామ్రాజ్యం.. కోట్ల విలువైన ఆస్తులు! ఇన్ని ఉన్నా కుటుంబంలో ఆస్తుల పంపకాల దగ్గర వివాదాలు రావడం కొత్తేమీ కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ప్రముఖ TVS కుటుంబంలోనూ కనిపిస్తోంది. TVS దిగ్గజం వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మీ వేణు తనకు కుటుంబ ఆస్తుల్లో సమాన వాటా కావాలంటూ తండ్రికి న్యాయపరమైన (పార్టిషన్) నోటీసులు పంపడం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది..
లక్ష్మీ వేణు వాదన ఏంటి?.. :
హిందూ వారసత్వ చట్టం 1956లో 2005లో చేసిన సవరణ ప్రకారం.. ఆడపిల్లలకు కూడా మగపిల్లలతో సమానంగా పూర్వీకుల ఆస్తుల్లో హక్కు ఉంటుంది. ఈ నేపథ్యంలో తనకు రావాల్సిన వాటాను చట్టబద్ధంగా పంచాలని ఆమె కోరుతున్నారు. కుటుంబ పెద్దగా వేణు శ్రీనివాసన్ ఈ విషయంలో న్యాయం చేయాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అసలు వివాదం ఎక్కడంటే? :
2020లో టీవీఎస్ కుటుంబంలోని పెద్దల మధ్య జరిగిన ఆస్తుల ఒప్పందం తన తండ్రి కుటుంబంలో ప్రత్యేకంగా ఆస్తుల విభజన చేసినట్లు కాదని లక్ష్మీ చెబుతున్నారు. వీఎస్ ట్రస్ట్‌తో పాటు టీవీఎస్ హోల్డింగ్స్, టీవీఎస్ మోటార్ కంపెనీ, టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్, సుందరం క్లెయిటన్ వంటి సంస్థల్లోని కుటుంబ ప్రయోజనాలపైనా తనకు హక్కు ఉందని వాదిస్తున్నారు..
తన సోదరుడు సుదర్శన్‌కు ఎక్కువ ప్రయోజనాలు దక్కేలా వ్యవహారాలు సాగాయని కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే, వ్యాపార నిర్వహణ బాధ్యతలు చూసుకోవడం మాత్రమే ఆస్తులపై పూర్తి యాజమాన్యాన్ని ఇవ్వదన్నది ఆమె ప్రధాన వాదనగా కనిపిస్తోంది..
కూతురికి తల్లి మద్దతు :
అయితే, ఈ వివాదంలో లక్ష్మీ తల్లి మల్లికా శ్రీనివాసన్ కూడా కుమార్తెకు మద్దతుగా నిలిచారు. కొడుకు, కూతురు ఇద్దరూ సమానమేనని, లక్ష్మీకి కూడా కుటుంబ ఆస్తుల్లో సమాన వాటా రావాలని ఆమె అభిప్రాయపడ్డారు..
అయితే, ఈ వ్యవహారాన్ని కోర్టు వివాదంగా మార్చకుండా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే లక్ష్మీ ఆకాంక్షగా కనిపిస్తోంది. మొత్తానికి ఆస్తుల పంపకాల విషయంలో కుటుంబ బంధాల కన్నా చట్టబద్ధమైన హక్కులే ఇప్పుడు కీలకంగా మారాయి..
