UPI Charges: UPI యూజర్లకు బిగ్ షాక్.. రూ.2000 దాటితే చార్జీలు.. ఎవరు కట్టాలి, ఎంత కట్టాలి?
ప్రభుత్వం పరిశీలిస్తున్న నూతన నిబంధనలు కేవలం వ్యాపార సంస్థలు స్వీకరించే డిజిటల్ చెల్లింపుల(UPI Charges)పై మాత్రమే ప్రభావం చూపనున్నాయి.
- V Santhosh Kumar
- Published on- August 5, 2026 / 08:19 AM IST
Upi transactions above 2000 rupees charges truths and facts
- యూపీఐ లావాదేవీలపై సర్వీస్ చార్జీలు
- రూ.2000 పైన మర్చంట్ రుసుము
- సామాన్య వినియోగదారులకు ఉచితం
UPI Charges: భారతదేశంలో డిజిటల్ విప్లవానికి ఊపిరిగా నిలిచిన UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సేవలు ప్రస్తుతం దేశంలోని ప్రతీ సామాన్యుడి దైనందిన జీవితంలో ఒక భాగమయ్యాయి. ఇటీవల రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన UPI (UPI Charges)లావాదేవీలపై చార్జీలు పడతాయనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. అయితే, వినియోగదారులు నేరుగా ఈ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ఇది సాధారణ బ్యాంకింగ్ బదిలీలకు సంబంధించినది కాదని స్పష్టమవుతోంది. చెల్లింపు రంగానికి చెందిన వ్యవస్థల స్థిరత్వం కోసం ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగాలు పరిశీలిస్తున్న ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (MDR) ప్రతిపాదనలపై ప్రజలలో ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
MDR ప్రతిపాదనలు & వినియోగదారులపై ప్రభావం:
ప్రభుత్వం పరిశీలిస్తున్న నూతన నిబంధనలు కేవలం వ్యాపార సంస్థలు (మర్చంట్లు) స్వీకరించే డిజిటల్ చెల్లింపులపై మాత్రమే ప్రభావం చూపనున్నాయి. రూ. 2,000 దాటిన పెద్ద మొత్తాల వ్యాపార లావాదేవీలపై 0.3% నుండి 0.5% వరకు MDR విధించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి (P2P) చేసే ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మనీ ట్రాన్స్‌ఫర్లకు ఈ చార్జీలు అస్సలు వర్తించవు. అలాగే పాలు, కూరగాయలు, ఆటో ఛార్జీల వంటి రోజువారీ చిన్న లావాదేవీలకు ఈ ప్రతిపాదిత నిబంధనల నుండి పూర్తిగా మినహాయింపు లభించే అవకాశం ఉంది.
అమలు తీరు & పరిశ్రమ అవసరాలు:
ప్రస్తుతం యూపీఐ రన్ చేస్తున్న డిజిటల్ పేమెంట్ కంపెనీలు, బ్యాంకులకు సాంకేతిక మౌలిక సదుపాయాల నిర్వహణ ఖర్చులు భరించలేని విధంగా మారడంతో ఈ రకమైన ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. పెద్ద వ్యాపారుల వార్షిక టర్నోవర్ ఆధారంగా ఈ రుసుమును నిర్ణయించే ఆలోచన కూడా జరుగుతోంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ ఛార్జీలు ఇప్పటికిప్పుడు అమల్లోకి రాలేదు, దీనిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మున్ముందు ఈ సేవలకు ఛార్జీలు విధించినా, ఆ భారాన్ని వ్యాపారులే భరించేలా చూసి, సామాన్య వినియోగదారులకు డిజిటల్ లావాదేవీలను ఉచితంగా ఉంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి.
