Silver Price
Silver Price : గత మూడ్రోజుల క్రితం వరకు బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. రోజుకు వేలల్లో పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఈ క్రమంలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం రూ.2లక్షలకు చేరువైంది.. కిలో వెండి రేటు రూ.3లక్షలు దాటేసింది. అయితే, అతిగా పెరుగుడు విరుగుడు కొరకే అన్నట్లుగా.. మూడ్రోజులుగా బంగారం, వెండి ధరలు కుప్పకూలుతున్నాయి.
బంగారం, వెండి ధరలు కొద్ది రోజులుగా క్రమంగా తగ్గతూ వస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో వీటిపై ఉన్న పన్నుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆదివారం రోజు భారతదేశంలో మాత్రమే బులియన్ మార్కెట్లు పనిచేశాయి. బంగారం, వెండి రెండింటి ధరలు తగ్గాయి. సోమవారం వెండి ధరలు తగ్గినప్పటికీ.. బంగారం ధరలు మాత్రం ఊగిసలాటలో ఉన్నాయి. ట్రేడింగ్ లో రోజంతా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. చివరికి 24 క్యారెట్ల బంగారం రూ.1,41,900కి చేరింది. మరోవైపు వెండి ధర భారీగా తగ్గింది.
సోమవారం ప్యూచర్ ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.33వేలు తగ్గింది. చివరికి 12.48శాతం తగ్గి.. రూ.2,32,500 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఔన్స్ బంగారం ధర 4,728 డాలర్లుగా నమోదైంది. వెండి ఔన్స్ 78.42 డాలర్లుగా ఉంది. అయితే, సోమవారం సాయంత్రంకు స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అమెరికా ఫెడరల్ బ్యాంక్ కు కొత్త చీఫ్ ను ట్రంప్ నియమించిన తరువాత డాలర్ ఇండెక్స్ బలపడుతూ వస్తోంది. ఫలితంగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి.
బంగారం, వెండి ధరల్లో రాబోయే కాలంలో భారీ తగ్గుదల ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన సుంకాలను తగ్గించారు. 25శాతం నుంచి 18శాతానికి సుంకాలను తగ్గిస్తూ స్వయంగా ట్రంప్ ప్రకటన చేశారు. దీంతో భారత్ మార్కెట్లకు ఇది భారీ శుభవార్తననే చెప్పొచ్చు. మరోవైపు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే పరిస్థితులు మరికొన్ని నెలలు కొనసాగితే బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కిలో వెండి రేటు గతంలోలా రూ.లక్షకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని నిపుణులు పేర్కొంటున్నారు.