Mobile Data Tax : వామ్మో.. ఏంది భయ్యా.. ఇప్పటికే 18% GST.. ఇప్పుడు ప్రతి GB డేటాపై కొత్త పన్ను? మొబైల్ యూజర్లకు డబుల్ టాక్స్!
Mobile Data Tax : మొబైల్ డేటా వినియోగానికి పన్ను విధించే ప్రతిపాదనను అధ్యయనం చేయాలని ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ శాఖను కోరింది. ప్రతి GB ఛార్జీకి రూ.1 చొప్పున పన్ను చెల్లించాల్సి రావొచ్చు. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
- Sreehari A
- Published On : March 16, 2026 / 12:30 PM IST
Mobile Data Tax ( Image Credit to Google Gemini AI )
- మొబైల్ డేటా వినియోగదారులకు బిగ్ షాకింగ్ న్యూస్..
- ప్రతి GB డేటాపై అదనంగా టాక్స్ కట్టాల్సిందే
- భారీగా పెరగనున్న మొబైల్ డేటా ధరలు
- మొబైల్ డేటాపై ప్రత్యేక పన్ను విధించనున్న ప్రభుత్వం
Mobile Data Tax : ఇంటర్నెట్ యూజర్లకు ఊహించని బిగ్ షాక్.. ఇకపై మొబైల్ డేటా ఎలా పడితే అలా వాడేస్తామంటే కుదరదు.. మీరు వాడే ప్రతి జీబీ డేటాపై ఇకనుంచి పన్ను పడుద్ది.. అతి త్వరలో కొత్త రూల్ రాబోతుంది. ఇదేగానీ అమల్లోకి వస్తే మొబైల్ డేటా యూజర్లు డేటా వాడకంపై అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మిలియన్ల మంది ఇంటర్నెట్ యూజర్ల జేబులపై నేరుగా అదనపు భారం పడనుంది.
మీరు సోషల్ మీడియా, ఓటీటీ ప్రియులైతే డబుల్ టాక్స్ కట్టేందుకు రెడీగా ఉండండి. ఇప్పటికే రీఛార్జ్ ధరలు పెరిగాయని లబోదిబోమంటుంటే.. దీనికి తోడుగా 18శాతం జీఎస్టీతో సతమతమవుతున్నారు ఇంటర్నెట్ యూజర్లు. ఇది చాలదన్నట్టు డేటా వినియోగంపై కూడా పన్ను విధించనుంది కేంద్ర ప్రభుత్వం. అతి త్వరలో ఇంటర్నెట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం మొబైల్ డేటాపై ప్రత్యేక పన్ను విధించడంపై టెలికాం రంగంలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే, ప్రభుత్వ ఖజానాకు దాదాపు 23,000 కోట్ల రూపాయలు వస్తాయి. కానీ, సామాన్యుల బడ్జెట్‌ను మాత్రం తీవ్రంగా దెబ్బతీస్తుంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మీడియా నివేదికల ప్రకారం.. ప్రభుత్వం ఇప్పుడు ఇంటర్నెట్ డేటాపై పన్ను విధించాలని యోచిస్తోంది. పీఎం నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదన గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. ఇంటర్నెట్ వినియోగదారులు ప్రతి GB డేటాకు రూ. 1 పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఫలితంగా మొబైల్ డేటా ధరలు భారీగా పెరుగుతాయి.
మొబైల్ డేటా ఇక చౌకగా దొరకదు :
ప్రపంచంలో అతి చౌకగా ఇంటర్నెట్ డేటా ధరలు అందించే దేశాల్లో భారత్ ఒకటి. దేశంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. ఇప్పుడు ఈ మొబైల్ డేటాను సానుకూల ప్రయోజనాల కోసం వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. డేటాకు పన్ను విధిస్తే ప్రజలు తక్కువ డేటాను వాడతారని, తద్వారా స్క్రీన్ సమయం తగ్గుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
అయితే, విద్యా, వినోద డేటా వినియోగాన్ని ప్రభుత్వం ఎలా కట్టడి చేయనుందో చూడాలి. ఈ విషయంపై టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) నుంచి ఒక నివేదికను అభ్యర్థించారు. ఇది సాధ్యమేనా కాదా? అనే పూర్తి నివేదికను సెప్టెంబర్ వరకు టెలికమ్యూనికేషన్స్ శాఖ సమర్పించాల్సి ఉంటుంది.
డేటాపై టాక్స్.. యూజర్లపై అదనపు భారం :
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మాజీ ప్రధాన సలహాదారు సత్య ఎన్. గుప్తా ఈ ప్రభుత్వ ప్రతిపాదన గురించి ఆందోళన వ్యక్తం చేశారు. డేటాకు పన్ను విధించడం సాధ్యం కాదని, దేశంలో డిజిటల్ సేవలకు కూడా అంతరాయం కలిగించవచ్చని ఆయన అన్నారు.
డిజిటల్ ఆవిష్కరణలను అణచివేస్తుందని, భారత ప్రపంచ డిజిటల్ నాయకత్వాన్ని ప్రమాదంలో పడేస్తుందని గుప్తా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మొబైల్ యూజర్లు మొబైల్ రీఛార్జ్‌పై 18శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితిలో, డేటాపై ప్రత్యేక పన్ను విధిస్తే వినియోగదారులు డబుల్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ ఖజానాకు రూ. 22,900 కోట్లు లాభం :
మీడియా నివేదికల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం స్పెక్ట్రమ్ వేలం, లైసెన్స్ ఫీజులతో సహా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. 2025లో దేశీయ మొబైల్ డేటా వినియోగం సుమారు 229 బిలియన్ GBకి చేరుకుంటుందని డేటా సూచిస్తుంది. అందువల్ల, GBకి ఒక రూపాయి పన్ను విధించడం వల్ల ప్రభుత్వానికి నేరుగా రూ. 22,900 కోట్ల ప్రయోజనం చేకూరుతుంది.
ప్రభుత్వ ఖజానాను పెంచినప్పటికీ ఇంటర్నెట్ వినియోగదారులకు మాత్రం జేబుకు భారంగా మారుతుంది. ఈ ప్రతిపాదన లాభనష్టాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం ప్రస్తుతం టెలికమ్యూనికేషన్ శాఖను ఆదేశించింది. నివేదిక అందిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
