Shadnagar Murder Case : షాద్ నగర్ మహిళ హత్య కేసు.. భార్యను చంపి మూటకట్టి బైక్ మీద పెట్టుకుని
Shadnagar Murder Case : షాద్ నగర్ మహిళ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
- Dharani Pilli
- Published On : March 24, 2026 / 09:44 AM IST
shadnagar police arrest man who killed wife brutally over suspicion
Shadnagar Murder Case : కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి.. కన్న బిడ్డను కూడా భార్య శవం దగ్గరే పొలాల్లో వదిలేసి వెళ్లిన నిందితుడిని తాజాగా షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబ్‌నగర్ జిల్లా వీరన్నపేటకు చెందిన పానుగంటి నర్సింహులు (31)కి, అదే ప్రాంతానికి చెందిన శోభ అలియాస్ శోభారాణి (33)తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరిది లవ్ మ్యారేజ్. శోభ, నర్సింహులు దంపతులకు మూడేళ్ల కుమార్తె మమత ఉంది. ఇదిలా ఉంటే నర్సింహులు కన్నా ముందు శోభకు వివాహమై ఒక కొడుకు ఉన్నాడు. మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత శోభ, నర్సింహులుని వివాహం చేసుకుంది.
కొంతకాలం పాటు వీరు అన్యోన్యంగానే ఉన్నారు. ఆ తర్వాత నర్సింహులు మద్యానికి బానిస కావడంతో.. కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. నర్సింహులు వేధింపులు భరించలేకపోయిన శోభ.. కుమార్తె మమతతో కలిసి రంగారెడ్డిగూడెంలో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి.. అక్కడే నివసిస్తోంది. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న నర్సింహులు ఎలాగైనా సరే ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో మార్చి 21న నర్సింహులు శోభకు కాల్ చేసి.. మహబూబ్ నగర్ వస్తే.. ఆమె కుమారుడికి సైకిల్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మి శోభ.. కుమార్తె మమతను తీసుకుని మహబూబ్ నగర్ కి వెళ్లింది. భార్యాబిడ్డలను తన గదికి తీసుకెళ్లిన నర్సింహులు అక్కడ కూడా మద్యం సేవించాడు. ఈ క్రమంలో మళ్లీ గొడవ జరగడంతో.. అప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్న గ్రానైట్ రాయితో ఆమె తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత ఎవరికీ తన మీద అనుమానం రాకుండా రక్తపు మరకలు తుడిచాడు. అనంతరం అర్ధరాత్రి సమయంలో శోభ డెడ్ బాడీని మూటగట్టి.. బైక్ పెట్రోల్ ట్యాంక్ పై పెట్టుకున్నాడు.
దానిపైనే తన మూడేళ్ల కుమార్తెను కూర్చోబెట్టుకుని, రంగారెడ్డిగూడెం శివారులోని ఓ పొలం గట్టున పడేసి పారిపోయాడు. పాప ఏడుపు విని అటుగా వచ్చిన స్థానికులు శోభ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సోమవారం ఉదయం లింగంపల్లిలో నర్సింహులుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి ఒక సెల్ ఫోన్, హత్యకు వాడిన రాయి, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
