విస్ట్రాన్‌‌లో విధ్వంసం.. వేలాది ఐఫోన్లు లూటీ.. రూ.440 కోట్లు నష్టం!

  • Publish Date - December 15, 2020 / 06:20 AM IST

Thousands Of iPhones Were Looted Wistron’s plant : కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో ఐఫోన్లు, ఎలక్ట్రానిక్‌ స్పేర్ పార్ట్స్  తయారీ సంస్థ విస్ట్రాన్‌ కార్పొరేషన్‌లో అత్యంత ఖరీదైన  వేలాది ఐఫోన్లను లూటీ చేశారు.

కర్ణాటక కోలార్‌లోని విస్ట్రాన్ ప్లాంట్ శనివారం హింసాత్మక ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేలాది ఐఫోన్‌లను లూటీ చేయడంతో సంస్థకు రూ. 440 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు  కంపెనీ వెల్లడించింది.

ఈ మేరకు కంపెనీ పోలీసులు, కార్మిక శాఖకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది. జీతభత్యాలు చెల్లించలేదన్న ఆగ్రహంతో ఫ్యాక్టరీలోని కార్మికులంతా విధ్వంసం సృష్టించారు. రాళ్ళు రువ్వారు. కోలార్ జిల్లాలోని నరసపురంలో విస్ట్రాన్ ఫ్యాక్టరీ ఉంది.

ఉద్యోగుల హింసాకాండ వల్ల విలువైన అత్యాధునిక యంత్రాలు, పరికరాలు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఉద్యోగులు ఫ్యాక్టరీలో ఫర్నిచర్ ధ్వంసం చేశారని పోలీసు అధికారులు చెప్పారు. గత నాలుగు నెలలుగా తమకు వేతనం చెల్లించలేదని కార్మికులు ఆరోపించారు.

ఉద్యోగులు ఉదయం 6:30 గంటల సమయంలో కర్మాగారాన్ని ధ్వంసం చేశారు. చాలావరకు కంపెనీకి సంబంధించిన విలువైన ఆస్తి ధ్వంసమైంది. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు చేస్తున్నామని కోలార్ ఎస్పీ కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు.

ఫ్యాక్టరీలో సుమారు 7వేల నుంచి 8వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా రెండు షిఫ్టులలో పనిచేస్తున్నారు. ధ్వంసానికి పాల్పడిన వారిని లాఠీ ఛార్జీతో చెదరగొట్టామని ఆయన చెప్పారు. ప్రాంగణంలో కంపెనీకి చెందిన రెండు వాహనాలు దెబ్బతిన్నాయని తెలిపారు.

దుండగులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని ఎస్పీ కార్తీక్ తెలిపారు. 5,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 2,000 మంది గుర్తు తెలియని వ్యక్తులు హింసాకాండకు పాల్పడ్డారని విస్ట్రాన్‌ ప్రతినిధి టీడీ ప్రశాంత్‌ చెప్పారు.

ఇప్పటివరకు 156 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఘటనను కర్ణాటక ప్రభుత్వం ఖండించింది. విస్ట్రా కంపెనీలో దౌర్జన్యానికి పాల్పడ్డ వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.