8 నెలల గర్భిణీ తల్లిని షూట్ చేసిన నాలుగేళ్ల చిన్నారి

కన్నవాళ్ల అప్రమత్తత లోపం ప్రాణాల మీదకు వచ్చింది. తుపాకీని ఆట బొమ్మగా భావించిన చిన్నారి గర్భిణీ అయిన తన తల్లినే షూట్ చేశాడు. వాషింగ్టన్‌లో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. పొరుగింటి వారితో విభేదాల కారణంగా భయపడిన వ్యక్తి ఆత్మరక్షణ కోసం తుపాకీని ఇంటికి తీసుకొచ్చి పరుపు కింద దాచి ఉంచాడు. నాలుగేళ్ల చిన్నారి దానిని ఆట బొమ్మగా భావించి కన్న తల్లి మొహానికి గురిపెట్టాడు. అయితే అప్పటికే ఆమె ఎంత వారించినా వినకుండా పేల్చేశాడు. 

ఎనిమిది నెలల గర్భిణీ అయిన ఆమె తీవ్ర రక్త స్రావంతో బాధపడుతుండటంతో  గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చావుబతుకుల మధ్య తీసుకువచ్చిన బాధితురాలికి వెంటనే చికిత్స మొదలుపెట్టడంతో కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. 

 తల్లిని షూట్ చేసిన చిన్నారి ఉద్దేశ్యపూర్వకంగా షూట్ చేయలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసుపై విచారణ మొదలుపెట్టిన పోలీసు అధికారి మాట్లాడుతూ.. అనుమతి లేని గన్‌ను కలిగి ఉండడంతో చిన్నారి తండ్రి మీద లీగల్ చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. గన్‌లను చిన్నారులకు అందుబాటులో ఉండకుండా జాగ్రత్త వహించాలని వారు బొమ్మలని భావించి షూట్ చేస్తే పెను ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయని హెచ్చరించారు.