Srushti Fertility Case: సృష్టి కేసు.. రంగంలోకి ఈడీ.. హవాలా రూపంలో రూ.40 కోట్లు!
డాక్టర్ నమ్రత 8 రాష్ట్రాల్లో ఈ కార్యకలాపాలు సాగించినట్లు పోలీసులు గుర్తించారు.

Srushti Fertility Case: సృష్టి ఫర్టిలిటీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగింది. కేసు వివరాలన్నీ కావాలని సిట్ పోలీసులకు ఈడీ లేఖ రాసింది. 86 మంది చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడింది డాక్టర్ నమ్రత. సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. హవాలా రూపంలో దాదాపుగా 40 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మధ్యవర్తుల ద్వారా లావాదేవీలు జరిపినట్లుగా అనుమానిస్తున్నారు. డాక్టర్ నమ్రత 8 రాష్ట్రాల్లో ఈ కార్యకలాపాలు సాగించినట్లు పోలీసులు గుర్తించారు.
సృష్టి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని హైదరాబాద్ సిటీ పోలీసులకు ఒక లేఖ ద్వారా కోరారు. దాదాపు 8 రాష్ట్రాల్లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ని ఓపెన్ చేసి దాదాపుగా 40 కోట్ల మేరకు ఆర్థిక లావాదేవీలు చేసినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా 86 మంది పిల్లల అమ్మకాలు, కొనుగోలు చేసినట్లు తెలుసుకున్నారు.
ఈ కేసులో ఇప్పటివరకు 30మందిని అరెస్ట్ చేశారు. వైజాగ్ కేజీహెచ్ కు చెందిన డాక్టర్లతో పాటు హైదరాబాద్ లో పని చేస్తున్న పలువురు డాక్టర్లు, టెక్నీషియన్స్ ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. ఈడీ ఎంటర్ కావడంతో మనీ లాండరింగ్ యాక్ట్ ఉలంఘనకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. ఈ డబ్బుని విదేశాలకు దారి మళ్లించి అక్కడ పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో కేసుకి సంబంధించిన పూర్తి వివరాలను కోరింది ఈడీ.