నేరానికి గురైనవారికి శిక్ష విధిస్తారా? ఇదెక్కడి న్యాయం.. అని ఓ అత్యాచార బాధితురాలి ఆవేదన. ఇద్దరు కలిసి 23ఏళ్ల యువతిపై అత్యాచారం చేశారు. తనపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఆ యువతి చేసిన తప్పు. పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ బాధితురాలికి జరిమానా విధించింది గ్రామపంచాయతీ. ఈ షాకింగ్ ఘటన చత్తీస్‌గఢ్ లోని జస్ పూర్ జిల్లాలో నవంబర్ 4న జరిగింది. తనకు అన్యాయం జరిగిందని చెబితే.. తిరిగి తననే పంచాయతీ పెద్దలు దూషించారు. పైగా రూ.5వేలు జరిమానా విధించడం చూసి బాధితురాలు నివ్వెరపోయింది.
ఇదెక్కడి న్యాయం.. అంటూ వాపోయింది. వివరాల్లోకి వెళితే.. జస్ పూర్ జిల్లాకు చెందిన 23ఏళ్ల యువతి.. తన సోదరుడితో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బంధువుల ఇంటికి వెళ్లి ఆ రాత్రి ఇంట్లోనే ఉంది. ఈ విషయం తెలిసిన సందీప్, కిషోర్ అనే ఇద్దరు యువకులు.. ఆమె దగ్గరకు వెళ్లి కూలిపని ఉంది చేస్తావా? అని అడిగారు. మరుసటి రోజు ఉదయం ఆమెకు ఫోన్ కాల్ చేసి తప్పకుండా పని ఇప్పిస్తామని నమ్మబలికారు. అది నమ్మిన యువతి.. నిర్మాణం జరిగే స్థలానికి వెళ్లింది. ఆమె లోపలికి రాగానే ఇద్దరు యువకులు ఆమెను లోపలికి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. పైగా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
ఆమె ఇంటికి వచ్చాక.. వెంటనే తన తల్లికి చెప్పింది. ఫిర్యాదు చేసేందుకు ఇద్దరు కలిసి పోలీసు స్టేషన్ కు వెళ్లారు. కానీ, ఏం జరిగిందో మాత్రమే పోలీసులకు వివరించారు. అధికారిక ఫిర్యాదు చేయమంటే ఇద్దరు తడబడ్డారు. వెంటనే తిరిగి ఇంటికి వెళ్లిపోయినట్టు ఓ రిపోర్టు తెలిపింది. పది రోజుల తర్వాత ఈ విషయం.. ఆ నోటా ఈ నోటా గ్రామపంచాయతీ దృష్టికి వెళ్లింది. పంచాయతీ పెద్దలు నవంబర్ 14న పంచాయతీ పెట్టారు. బాధిత యువతి తనకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా చెప్పింది. పంచాయతీ.. నిందితులైన కిషోర్, సందీప్ ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా విధించారు.
ఇదిలా ఉండగా, బాధిత యువతి కూడా నేరం చేసిందని నిందితులిద్దరూ పంచాయతీ ఎదుట ఆరోపించారు. పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారంటూ చెప్పారు. గ్రామపంచాయతీ ప్రతిష్టను దిగజార్చారనే ఆగ్రహాంతో పెద్దలు బాధితురాలికి కూడా రూ.5వేలు జరిమానా విధించారు. పంచాయతీ పెద్దల నిర్ణయంతో రెండు రోజులు మెంటల్ షాక్ కు గురైంది యువతి. అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకుంది. వెంటనే పోలీసు స్టేషన్ కు వెళ్లి తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు.