ఢిల్లీలో హింసాత్మకంగా సీఏఏ ఆందోళన

ఢిల్లీలో ఆదివారం(ఫిబ్రవరి-23,2020)పౌరసత్వ సవరణ చట్టం(CAA) వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న జఫ్రాబాద్ ఏరియాకు సమీపంలోనే మౌజ్‌పూర్ ఉంది. 

సీఏఏకు మద్దతుగా స్థానిక బీజేపీ నాయకుడు నేతృత్వంలో ఓ వర్గం మౌజ్‌పూర్‌లో ర్యాలీ తీయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరిపై మరొకరు రాళ్లురువ్వుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. అనంతరం ప్రదర్శకులపై లాఠీచార్జి జరిపారు.

ఇరువర్గాల మధ్య ఎడతెరిపి లేకుండా రాళ్లు రువ్వుడు ఘటనలు చోటుచేసుకోవడంతో హుటాహుటిన ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో మౌజ్‌పూర్ మెట్రోస్టేషన్ మూసేశారు. రాళ్లు రువ్వుడు ఘటనలో పలువురికి గాయాలైనట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు