ఆన్ లైన్ అమ్మకాల్లో ఇప్పటికే అనేక మోసాలు జరిగాయి. ఒకటి ఆర్డర్ ఇస్తే మరొకటి పంపుతున్నారు. వేలకు వేలు డబ్బులు కట్టించుకుని.. నకిలీ ఐటెమ్స్ డెలివరీ చేస్తున్నారు. ఫోన్
ఆన్ లైన్ అమ్మకాల్లో ఇప్పటికే అనేక మోసాలు జరిగాయి. ఒకటి ఆర్డర్ ఇస్తే మరొకటి పంపుతున్నారు. వేలకు వేలు డబ్బులు కట్టించుకుని.. నకిలీ ఐటెమ్స్ డెలివరీ చేస్తున్నారు. ఫోన్ ఆర్డర్ చేస్తే ఇటుకలు, రాళ్లు పంపిన సందర్భలూ ఉన్నాయి. తాజాగా కర్నాటక రాజధాని బెంగళూరులో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. భారీ మోసం వెలుగుచూసింది. రూ.93వేలు చెల్లించి ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. నకిలీ ఫోన్ డెలివరీ చేశారు.
బెంగళూరుకి చెందిన రజనీకాంత్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఐఫోన్-11 ప్రో కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చాడు. దీని కోసం రూ.93వేలు చెల్లించాడు. కొన్ని రోజులకు డెలివరీ వచ్చింది. బాక్స్ ఓపెన్ చేసి చూశాడు. అందులో ఉన్నది చూసి అతడు షాక్ తిన్నాడు. అది.. తాను అనుకున్న ఫోన్ కాదు. అందులో వచ్చిన ఫోన్ ను పరిశీలించి చూస్తే.. అది నకిలీ ఐఫోన్ అని తేలింది. ఐఫోన్ 11 ప్రోకు ఉన్న ట్రిపుల్ కెమెరా సెన్సర్లను ఆ ఫోన్ కు అతికించి ఉండడం గమనించాడు. ఫోన్ ఆన్ చేసి చూస్తే అసలు అది ఐవోఎస్ తో పనిచేసే ఫోన్ కాదని తేలింది. దీంతో వెంటనే అతడు ఫ్లిప్ కార్ట్ కు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం..కొత్త ఫోన్ ఇస్తామని హామీ ఇచ్చింది.
కాగా, ఆన్ లైన్ లో ఇలాంటి నకిలీ ఉత్పత్తులు రావడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ఫ్లిప్ కార్ట్ వేదికగా ఉత్పత్తులు విక్రయించే థర్డ్ పార్టీ కంపెనీలు ఇలా నకిలీ ఉత్పత్తులను డెలివరీ చేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నాయి. ఆన్ లైన్ లో ఆఫర్లు ఎక్కువగా ఉంటున్నాయి. భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నారు. దీంతో జనాలు ఆన్ లైన్ లో ఉత్పత్తులు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో కొందరు మోసాలకు తెరతీస్తున్నారు. కస్టమర్లను అడ్డంగా దోచేస్తున్నారు.