Cyber Criminals: ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురంలో విషాదం చోటు చేసుకుంది. సైబర్ నేరగాళ్ల వేధింపులో కోరం రామారావు అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కోరం రామారావు ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ మూడు రోజులుగా అతడిని వేధింపులకు గురి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన పురుగుల మందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. రామారావు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఎఫ్ఎస్ ఎల్ కు పంపించి సైబర్ నేరగాళ్ల వివరాలు సేకరిస్తున్నారు.
బలవన్మరణానికి ముందు రామారావు పోలీసులకు ఒక లేఖ రాశాడు. అందులో సైబర్ క్రిమినల్స్ తనను ఏ విధంగా వేధించింది తెలిపాడు. సైబర్ క్రిమినల్స్ తన ఫోన్ ను హ్యాక్ చేశారని, డేటా మొత్తం సేకరించారని తెలిపాడు. వారి వేధింపులు భరించలేకపోయినట్లు అందులో తెలిపాడు. తన కుటుంబసభ్యులను కాపాడాలని లేఖలో పోలీసులను వేడుకున్నాడు. తన పోరువు పోతుందనే భయంతో బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు లేఖలో తెలిపాడు. పురుగుల మందు తాగిన రామారావును కుటుంబసభ్యులు వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రామారావు చనిపోయాడు. దీనిపై మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.