Thane Husband Murder : చీరలు కొనివ్వలేదని.. కుక్కర్ మూతతో భర్తను హత్యచేసిన భార్య.. గుండెపోటు అంటూ డ్రామా.. పోలీసుల ఎంట్రీతో..
Woman Kills Husband In Thane : మహారాష్ట్ర థానేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చీరలు కొనివ్వలేదని ఓ భార్య తన భర్తను కుక్కర్ మూతతో కొట్టి హత్య చేసింది.
Woman Kills Husband In Thane
- మహారాష్ట్ర థానేలో దారుణ ఘటన
- చీర కొనివ్వలేదని భర్తను హత్యచేసిన భార్య
- పోస్టుమార్టంలో రిపోర్టులో అసలు విషయం వెలుగులోకి
Woman Kills Husband In Thane : దేశవ్యాప్తంగా భార్యల చేతిలో చనిపోతున్న భర్తల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వివాహేతర సంబంధంకు అడ్డొస్తున్నాడని కొందరు మహిళలు భర్తలను హత్య చేస్తుండగా.. చిన్నచిన్న విషయాలకు ఘర్షణలు పడుతూ క్షణికావేశంలో వివిధ రూపాల్లో భర్తలను హత్య చేస్తున్న ఘటనలు కుప్పలుతెప్పలుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. చీరలు కొనివ్వలేదన్న కోపంతో కుక్కర్ మూతతో భర్తపై దాడి చేసి భార్య హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనకు చీరలు కొనివ్వలేదన్న కోపంతో ఓ మహిళ భర్తను ప్రెషర్ కుక్కర్ మూతతో కొట్టింది.. ఆ తరువాత అతని గొంతు నులిమి హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. హత్య తరువాత భర్త గుండెపోటుతో కిందపడి చనిపోయాడంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులనుసైతం తప్పుదోవ పట్టించింది. అయితే, పోస్టుమార్టం నివేదికతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాకు చెందిన సునీతాదేవి హరేరామ్ సింగ్ (30), ఆమె భర్త హరేరామ్ కిషున్జీ సింగ్ (35) మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్ ఈస్ట్‌లో నివాసం ఉంటున్నారు. జూలై 19న హరేరామ్ ఇంటికి వచ్చిన సమయంలో తన కోసం చీరలు తీసుకురాలేదని భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తురాలైన సునీతాదేవి వంటగదిలో ఉన్న ప్రెషర్ కుక్కర్ మూతతో భర్త తలపై దాడి చేసి, అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
హత్య తరువాత భర్త గుండెపోటుతో కుప్పకూలిపోయాడని చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా తొలుత పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన పోస్టుమార్టంలో ఊపిరాడకుండా చేయడం వల్లే మరణం సంభవించినట్లు తేలడంతో కేసు మలుపు తిరిగింది. అనంతరం కుటుంబ సభ్యులు, ఇంటి యజమాని నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా భార్యపై అనుమానం బలపడింది. దీంతో పోలీసులు సునీతాదేవిని అరెస్టు చేసి విచారించగా.. చీర కొనివ్వలేదనే కోపంతో భర్తను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో ఆమెను స్థానిక కోర్టు కస్టడీకి పంపించింది. ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.
