Hyderabad : అర్ధరాత్రి మహిళకు వీడియో కాల్.. ఆ వెంటనే కానిస్టేబుల్ ఆత్మహత్య! ఏం జరిగిందంటే?
Telangana Police Constable Chandrasekhar Suicide : తెలంగాణ పోలీస్ శాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ మలక్‌పేట్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Telangana Police Constable Chandrasekhar Suicide
Telangana Police Constable Chandrasekhar Suicide : తెలంగాణ పోలీస్ శాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ మలక్‌పేట్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముసారాంబాగ్ శాలివాహన నగర్‌లోని తన నివాసంలో కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ (35) ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
చంద్రశేఖర్ అంబర్పేట్ హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆత్మహత్యకు ముందు ఓ యువతికి వీడియో కాల్ చేసినట్లు సమాచారం. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఆమెకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆందోళనకు గురైన యువతి వెంటనే చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించింది. చైతన్యపురి పోలీసులు ఈ విషయాన్ని మలక్‌పేట్ పోలీసులకు చేరవేశారు. వెంటనే మలక్‌పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే ఆయన ఇంట్లో మృతి చెందిన స్థితిలో కనిపించాడు.
చంద్రశేఖర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్ చంద్రశేఖర్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏమిటి అనేది ప్రస్తుతం తెలియాల్సి ఉంది. యువతికి చేసిన వీడియో కాల్.. అందులో జరిగిన సంభాషణ, ఇతర అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
అదేవిధంగా చంద్రశేఖర్ వ్యక్తిగత జీవితం, విధులకు సంబంధించిన అంశాలతో పాటు.. విధుల సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? ఆత్మహత్య చేసుకోవడానికి ముందు జరిగిన పరిణామాలపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. దర్యాప్తు తరువాతనే కానిస్టేబుల్ చంద్రశేఖర్ మృతికి అసలు కారణం స్పష్టమయ్యే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.
