Eluru Couple Suicide : ఇద్దరు బిడ్డల తల్లితో యువకుడి ప్రేమాయణం.. కట్ చేస్తే రెండు నింటు జీవితాలు బలి
Eluru Couple Suicide : పెళ్లై.. ఇద్దరు బిడ్డలకు తల్లైన ఓ వివాహిత.. మరో యువకుడిని రెండో వివాహం చేసుకుంది. ఆ తర్వత ఏం జరిగిందంటే..
- Dharani Pilli
- Published On : March 27, 2026 / 03:18 PM IST
eluru couple commits suicide jump into canal over love issue
Eluru Couple Suicide : సమాజం, కట్టుబాట్లు, నీతి నియమాలు వంటి వాటిని తుంగలో తొక్కి.. నచ్చినట్లు జీవించడానికి మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా సమాజంలో అనైతిక బంధాలు పెరుగుతున్నాయి. వాటిని అడ్డుకుంటే హత్యలకు కూడా వెనకాడటం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో శ్రీరామ నవమి పండగ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లై, ఇద్దరు బిడ్డలకు తలయ్యిన మహిళను ప్రేమించిన ఓ వ్యక్తి.. ఆమెను వివాహం చేసుకున్నాడు. దీని గురించి మహిళ మొదటి భర్త, కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు. ఈక్రమంలో సదరు ప్రేమ జంట దారుణానికి ఒడిగట్టారు. ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ విషాదకర సంఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం, యర్రమళ్ల గ్రామంలో నివాసం ఉంటున్న గుండుగొలను సత్యనారాయణ, వీరమ్మ దంపతులకు అయిదుగురు సంతానం. అందరూ కుమారులే. వీరిలో చివరి వాడైన చిన మావుళ్లయ్య.. చేపల ప్యాకింగ్ పనికెళ్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీకాకుళం జిల్లా సింగుపురానికి చెందిన ఇర్రి రమ(34)తో అనే వివాహిత మహిళతో పరిచయం ఏర్పడింది. చివరకు అది కాస్త ప్రేమగా మారింది. రమకు వివాహం కావడం మాత్రమే కాక.. ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు.
అయినా సరే.. రమ, మావుళ్లయ్య వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం విషయం రమ భర్త, తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు యర్రమళ్ల వచ్చి.. మావుళ్లయ్య కుటుంబంతో గొడవకు దిగారు. ఆపై రమను తీసుకుని వారి స్వగ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో మార్చి 24న మావుళ్లయ్య తన అన్న కొడుకు సతీశ్ అనే యువకుడికి కాల్ చేశాడు. రమ వచ్చిందని.. తనని ఆ రాత్రికి ఉంగటూరులో ఉంచి.. బుధవారం ఉదయమే మాట్లాడదామని అన్నాడు. ఈలోపు సతీశ్ ని నాచుగుంట రమ్మని కోరాడు.
మావుళ్లయ్య చెప్పిన ప్రకారం నాచుగుంట గ్రామానికి వెళ్లిన సతీష్ కు అక్కడ ఎవరూ కనిపించలేదు.. కాలువ గట్టున చిన మావుళ్లయ్య వస్తువులు ఉండటంతో.. కాలువలోకి దూకి ఉండొచ్చని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అదృశ్యం కేసు నమోదు చేశారు. ఆపై తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది కాలువలో దిగి మావుళ్లయ్య కోసం గాలించారు. బుధవారం రాత్రి ఉంగుటూరు వద్ద కాలువలో మావుళ్లయ్య మృతదేహం వెలుగు చూసింది.
రమ కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావించిన పోలీసులు మంగళగిరి నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని గురువారం రప్పించి గాలింపు చేపట్టారు. ఈక్రమంలో వారికి చేబ్రోలు పోలీస్ స్టేషన్ సమీపంలో కాలువలో రమ మృతదేహాన్ని గుర్తించారు. వీరిద్దరూ చేసిన పనికి ఓ తల్లికి గర్భశోకం మిగలగా.. ఇద్దరు చిన్నారులు తల్లిలేని బిడ్డలయ్యారు. రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
