Greater Noida: Two Class 12 GirlsJump Off Moving Bus, to Escape Harassment : మహిళలు, యువతులు, బాలికల రక్షణ కోసం ఫ్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసి శిక్షిస్తున్నా వారిపై వేధింపులు ఆగట్లేదు. ప్లస్ టూ చదువుతున్న విద్యార్ధినులు కాలేజీకి వెళ్లేందుకు ఒక ప్రైవేట్ బస్సు ఎక్కగా అందులోని యువకులు , విద్యార్ధినుల పై వ్యాఖ్యలు చేశారు. దీంతో భయపడిన యువతులు కదులుతున్న బస్సులోంచి కిందకు దూకి గాయాలపాలయ్యారు.
ఉత్తర ప్రదేశ్ లోని నోయిడా సమీపంలోని రన్హేరా గ్రామం నుంచి జువార్-సికింద్రాబాద్ రహదారి గుండా బులంద్ షహర్ వెళ్లే ప్రైవేట్ బస్సులో, కాకోడ్ లో 12వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధినులు ఎక్కారు. బస్సు ముందు సీట్లలో కొందరు యువకులు కూర్చుని ఉండటంతో వారు వెనక్కు వెళ్లి కూర్చున్నారు. బస్సు వెళుతున్న రూట్ లో బారంపూర్ గ్రామంలో రోడ్డు మీద ఉన్న మరి కొందరు విద్యార్ధినులు బస్సు ఆపమని సైగ చేశారు. అయినా డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లిపోయాడు.
బస్సులోని విద్యార్ధినులు, బస్సు ఆపి వాళ్లను కూడా ఎక్కించుకోమని కోరాగా డ్రైవర్ నిరాకరించాడు. అక్కడ స్టాప్ లేదని, వారిని ఎక్కించుకోలేనని చెప్పి బస్సును ఆపకుండా పోనిచ్చాడు. ఈక్రమంలో బస్సులో ముందు కూర్చున్న యువకులు, వారిపై వ్యాఖ్యలు చేయటం మొదలెట్టారు. ఈ రోజు బస్సు ఆగదు. మజాగా ఉంటుంది అని వ్యాఖ్యానించారు. దీంతో భయపడిన విద్యార్ధినులు వెనక్కు వెళ్లి కూర్చున్నారు.
అయినప్పటికీ యువకులు వారిని వేధించటం మానలేదు. కాసేపటి తర్వాత వారిలో ఒక విద్యార్ధిని మళ్లీ డ్రైవర్ వద్దకు వెళ్లి బస్సు ఆపమని అభ్యర్ధించింది. అయినా డ్రైవర్ అంగీకరించక బస్సు నడుపుతూనే ఉన్నాడు. మరోవైపు యువకులు కేకలు వేస్తూ వారిని టీజ్ చేయటం మొదలెట్టారు. భయపడిన బాలికలు ఇద్దరూ నడుస్తున్న బస్సులోంచి కిందకు దూకేశారు.
ఈక్రమంలోవారికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి కాలికి, నడుముకు తీవ్రగాయాలు కాగా, మరోకరి తలకు గాయాలయ్యాయి. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గ్రేటర్ నోయిడా పోలీసులు డ్రైవర్ పై ఐపిసి సెక్షన్లు 279 (రాష్ డ్రైవింగ్), 337 (ఏ వ్యక్తికైనా బాధ కలిగించేది) కింద కేసు నమోదు చేశారు.
కాగా బాలికల తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో డ్ర్రైవర్ పై ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, యువకుల వ్యాఖ్యలకు సంబంధించిన ఫిర్యాదు అందలేదని గ్రేటర్ నోయిడా డీసీపీ విశాల్ పాండే చెప్పారు.