హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. పీఎస్‌లోకి దూసుకెళ్లి మరీ దాడి

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని మృతురాలి బంధువులు చితకబాదారు. అడ్డువచ్చిన పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

Hayath Nagar Police Station : హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ లోకి కొంతమంది చొచ్చుకుని వచ్చి పోలీసులపై దాడి చేశారు. నిన్న ఓ వివాహిత మృతి చెందగా ఈ కేసులో నిందితుడు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. దీంతో మృతురాలి బంధువులు పీఎస్ లోకి చొచ్చుకుని వచ్చారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని మృతురాలి బంధువులు చితకబాదారు. అడ్డువచ్చిన పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

హయత్ నగర్ కు సమీపంలోని బంజారా కాలనీలో నిన్న దివ్య అనే వివాహిత మృతి చెందింది. దీంతో ఆమె బంధువులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దివ్యను ఆమె భర్తతో పాటు అతడి కుటుంబసభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలు బంధువులు ఆరోపించారు. తమకు కనీసం దివ్య డెడ్ బాడీ కూడా చూపించడం లేదని మండిపడ్డారు. దివ్య ఇంట్లోకి వెళ్లాలన్నా.. పోలీసులు అనుమతించడం లేదన్నారు. కాగా, న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతురాలి కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు.

దివ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దివ్య భర్త, అత్త మామల వేధింపుల కారణంగానే తమ కూతురు చనిపోయిందని దివ్య తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దివ్య మృతదేహాన్ని తమకు చూపించడం లేదని, మరోవైపు దివ్య భర్తను అరెస్ట్ చేయకుండా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మృతురాలి కుటుంబసభ్యులు మండిపడ్డారు. దీనికి నిరసనగా బాధిత కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. అదే సమయంలో పోలీసులు దివ్య భర్తను అక్కడికి తీసుకొచ్చారు. దీంతో అతడిని పట్టుకుని దివ్య కుటుంబసభ్యులు చితకబాదారు. వారి దాడిని అడ్డుకోబోయిన పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ దాడితో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శివ, దివ్యకు 14 నెలల క్రితం పెళ్లైంది. వీరికి ఒక పాప కూడా ఉంది. కొంతకాలంగా కుటుంబంలో తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దివ్య చనిపోవడం కలకలం రేపింది.

Also Read : ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మహిళపై అఘాయిత్యం.. ఇద్దరు డైవర్ల అరెస్ట్

ట్రెండింగ్ వార్తలు