Murder Attempt On Wife : కాపురానికి రావట్లేదని భార్యపై హత్యాయత్నం
కాపురమన్నాక మొగుడు పెళ్లాల మధ్య సవాలక్ష నమస్యలు వస్తుంటాయి పోతుంటాయి. ప్రతి విషయాన్ని సాగీదీస్తే సంసారం సజావుగా సాగదు.
- chvmurthy
- Published On : October 25, 2021 / 09:26 AM IST
Husband Murder Attempt On Wife
Murder Attempt On Wife : కాపురమన్నాక మొగుడు పెళ్లాల మధ్య సవాలక్ష నమస్యలు వస్తుంటాయి… పోతుంటాయి. ప్రతి విషయాన్ని సాగీదీస్తే సంసారం సజావుగా సాగదు. పిలిచిన వెంటనే కాపురానికి రాలేదని భార్యను కిరాతకంగా పొడిచాడో భర్త.
చిత్తూరు జిల్లా సోమల మండలం 81 ఉప్పరపల్లి పంచాయతీ మల్లోలపల్లెకు చెందిన భాగ్యశ్రీ అనే యువతికి మూడేళ్ల క్రితం పూతలపట్టు మండలం దొమ్మాల్లపల్లెకు చెందిన వెంకట్రాది అనే యువకునితో వివాహం అయ్యింది. వీరికి 9 నెలల బాబు కూడా ఉన్నాడు.
ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్యం బాగోలేక భాగ్యశ్రీ 3 రోజుల కిందట పుట్టింటికి వచ్చింది. ఆదివారం, అక్టోబర్24 న అత్తారింటికి వచ్చిన వెంకటాద్రి భార్యను తనతో ఇంటికి రమ్మని కోరాడు. కొద్ది రోజుల తర్వాత వస్తానని భాగ్యశ్రీ చెప్పింది. సరే అయితే ఆస్పత్రిలో చూపిస్తాను… రమ్మనమని భార్యకు నచ్చచెప్పి, ద్విచక్ర వాహనం పైకి ఎక్కించుకుని సోమల బయలు దేరాడు.
Read Also : Crocodile : చేపలు పడుతుంటే బాలుడ్ని లాక్కెళ్లిన మొసలి
మార్గం మధ్యలో అడుసుపల్లె పొలాల వద్ద వాహనం ఆపి భార్యను కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. ఆమె కేకలు వేయటంతో సమీపంలోని పొలాల్లోని రైతులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. రైతులను చూసిన వెంకటాద్రి పరారయ్యాడు. తీవ్రంగ గాయపడిన భాగ్యశ్రీని రైతులు స్ధానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
అక్కడ ప్రాధమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం పీలేరు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి తిరుపతి రుయా అస్పత్రికి తరలించారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
