Karimnagar SI : గన్నేరు పప్పు తిని భార్య మృతి.. మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న SI
Karimnagar SI : మూరు రోజుల క్రితం కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ భార్య గన్నేరు పప్పు తిని చనిపోగా.. నేడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు.
- Dharani Pilli
- Published On : March 21, 2026 / 11:37 AM IST
karimnagar two town si chandrasekhar ends his life after wife death
Karimnagar SI : మూడు రోజుల క్రితం కరీంనగర్‌లో ఎస్ఐ చంద్రశేఖర్ భార్య ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దివ్య.. మూడు రోజుల క్రితం గన్నేరు పప్పు దంచుకుని తిని ఆత్మహత్య చేసుకుంది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ముందుగా కరీంనగర్.. ఆ తర్వాత హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగానే ఆమె కన్నుమూశారు. దివ్య ఆత్మహత్య నేపథ్యంలో ఆమె బంధువులు భర్త ఎస్ఐ చంద్రశేఖర్ మీద దాడి చేశారు. ఇదిలా ఉంటే తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. భార్య దివ్య మరణాన్ని తట్టుకోలేకపోయిన చంద్రశేఖర్.. దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఆయన కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఈ దంపతుల పిల్లలు అనాథలయ్యారు.
ఇల్లంతకుంట మండలం సీతంపేట స్వగ్రామంలో దివ్య అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల అనంతరం ఎస్ఐ చంద్రశేఖర్ సీతంపేటలోనే ఉంటున్నారు. భార్య మృతితో మనస్థాపానికి గురైన చంద్రశేఖర్.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులిద్దరూ చనిపోవడంతో.. ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సీతంపేటకు చెందిన దివ్య (30)కు 2016లో దేసు చంద్రశేఖర్‌తో వివాహమైంది. ప్రస్తుతం వీరు కరీంనగర్‌లోని హనుమాన్‌నగర్‌లో ఉంటుండగా.. చంద్రశేఖర్ టూటౌన్‌లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో.. పిల్లలు అనాథలయ్యారు. చిన్నారులను చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు.
