భర్త చనిపోతాడని ఇన్సూరెన్స్ చేయించింది.. ఎంతకీ చావకపోవడంతో.. ఖమ్మంలో సంచలన క్రైమ్ స్టోరీ..
Khamma Husband Killed for Insurance Money : అనారోగ్యం పాలైన భర్త మీద భారీగా బీమా చేయించిందో మహిళ. నెలలు గడుస్తున్నా భర్త చనిపోవడం లేదు. దీంతో ఆమె స్వయంగా ప్లాన్ చేసి మరీ భర్తను హత్య చేయించింది.
- Dharani Pilli
- Published On : March 9, 2026 / 07:53 AM IST
khammam wife killed husband for insurance money rs 66 lakh and create it an accident
Khamma Husband Killed for Insurance Money : పురాణాల్లో భర్త ప్రాణాల కోసం యముడితో పోరాడిన సాద్వీమణుల గురించి చదివాం. కానీ నేటి కలికాలంలో కాసుల కోసం కట్టుకున్న వాడిని స్వయంగా తమ చేతులతోనే యమపురికి పంపుతున్న ఇల్లాళ్ల గురించి చదువుతుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అనారోగ్యం పాలైన భర్త త్వరలోనే చనిపోతాడని భావించిన భార్య.. అతడిపై పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ పాలసీ చేయించింది. అయితే సమయం గడిచినా భర్త చనిపోకపోవడంతో.. తానే స్వయంగా అతడిని హత్య చేయించింది. ఈ భయానక సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఖమ్మం నగరానికి చెందిన చాగంటి రవి (52) అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మద్యానికి బానిసైన అతడు తాగి వచ్చి తరచుగా భార్య ప్రశాంతితో గొడవపడేవాడు. ఇదిలా ఉండగా కొన్నాళ్ల క్రితం రవి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడు త్వరలోనే చనిపోతాడని భావించిన ప్రశాంతి.. భర్త రవి పేరు మీద పెద్ద మొత్తంలో బీమా చేయించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం గత సంవత్సరం రవి బంధువైన దేశబోయిన శ్రీనివాస్‌తో కలిసి తమకు తెలిసిన ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్ ద్వారా.. భర్త పేరు మీద రూ. 66 లక్షలకు బీమా చేయించింది. అయితే నెలలు గడుస్తున్నా రవి చనిపోకపోవడంతో బీమా డబ్బుల కోసం ప్రశాంతి దారుణ నిర్ణయం తీసుకుంది. తన భర్తను హత్య చేయించేందుకు రెడీ అయ్యింది.
దీనిలో భాగంగా రవి బంధువు అయిన దేశబోయిన శ్రీనివాస్, అతడి మరో ముగ్గురు స్నేహితులైన జోగి వెంకటేష్, రాజ్ కుమార్, రాంబాబులతో కలిసి భర్త హత్యకు పథకం రచించింది. రవిని చంపాక వచ్చే బీమా డబ్బుల్లో సగం వారికి ఇచ్చేస్తానని ప్రశాంతి వారితో ఒప్పందం చేసుకుంది. పథకంలో భాగంగా.. ఈ నెల 2న శ్రీనివాస్.. రవిని ఆటోలో ఎక్కించుకువెళ్లి.. అతడికి ఫుల్లుగా మద్యం తాగించాడు. మత్తులో మునిగిపోయిన రవిని తీసుకువచ్చి.. ఖమ్మం రూరల్ మండలం వీవీ పాలెం శివారులో వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కాసేపటికే.. జోగి రాజ్ కుమార్.. వెంకటేశ్‌కు చెందిన కారు తీసుకుని.. స్పీడుగా నడుపుతూ వచ్చి.. రవిని వెనుక నుంచి ఢీకొట్టాడు.
అయితే తాము రవిని కారుతో గుద్ది హత్య చేసే సమయంలో.. ఆ రోడ్డులో ఎవరైనా వస్తున్నారేమో అని గమనించేందుకు గాను జోగి రాంబాబును కాపలా పెట్టారు. రవికి యాక్సిడెంట్ చేసిన తర్వాత రాజ్‌కుమార్ ఆ కారును ఖమ్మం రూరల్ మండలంలోని తనగంపాడు గ్రామంలో నివాసం ఉంటున్న జోగి వెంకటేష్ స్నేహితుడైన సురేశ్ ఇంటి దగ్గరకు తీసుకెళ్లాడు. సురేశ్‌ని కలిసి.. కారుకు యాక్సిడెంట్ అయ్యిందని.. తర్వాత వచ్చి తీసుకెళ్తాను అని తెలిపాడు.
ఇదిలా ఉంటే.. వీవీ పాలెం శివారులో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి చనిపోయాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ ప్రారంభించి.. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు. రవి భార్య ప్రశాంతే హత్యకు కుట్ర పన్నిందని తేల్చారు. హతుడి భార్య ప్రశాంతిని, మిగతా నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
