ఎల్బీనగర్ లో విషాదం : సొంత ఆసుపత్రిలోనే డాక్టర్ ఆత్మహత్య

  • Publish Date - February 4, 2020 / 07:42 AM IST

హైదరాబాద్ ఎల్బీనగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్బీ నగర్ లోని వైష్ణవి హాస్పిటల్స్(vaishnavi hospitals) ఎండీ అజయ్ కుమార్.. తన ఆసుపత్రిలోనే ఉరి వేసుకుని చనిపోయాడు. తన చావుకి నలుగురు వ్యక్తులు కారణం అని సూసైడ్ నోట్ రాయడం సంచలనం సృష్టిస్తోంది. తన ఆసుపత్రి బిల్డింగ్ యజమాని కరుణాకర్ రెడ్డి, అతడి బావమరింది కొండల్ రెడ్డితో పాటు సరస్వతి నగర్ కాలనీ ప్రెసిడెంట్ మెగా రెడ్డి, కాంగ్రెస్ నేత శివకుమార్ తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని అజయ్ వాపోయాడు.

వారి ఒత్తిడి కారణంగానే సూసైడ్ చేసుకుంటున్నట్టు నోట్ లో వివరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఆత్మహత్యకు అసలు కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. సూసైడ్ నోట్ లో రాసిన వ్యక్తులను పట్టుకునే పనిలో ఉన్నారు. వారిని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.

ప్రాణాలు పోయాల్సిన డాక్టర్.. ఇలా సూసైడ్ చేసుకోవడం అందరిని షాక్ కు గురి చేసింది. డాక్టర్ అజయ్ 7 పేజీల సూసైడ్ నోట్ రాశారు. అందులో తన చావుకి కారణం నలుగురు అని చెప్పిన డాక్టర్.. వారి పేర్లు కూడా ప్రస్తావించాడు. మానసిక వేధింపులు, ఆర్థిక లావాదేవీలు ఆత్మహత్యకు కారణం అని తెలుస్తోంది. ఆ నలుగురు చేస్తున్న మోసాలు భరించలేక తనువు చాలిస్తున్నట్టు సూసైడ్ నోట్ లో అజయ్ తెలిపాడు.

పోస్టుమార్టం నిమిత్తం అజయ్ మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా మార్చురికి తరలించారు. ఆసుపత్రి సిబ్బందిని, అజయ్ కుటుంబసభ్యులనుపోలీసులు విచారిస్తున్నారు. పలు కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పోలీస్ టీమ్ ఏర్పాటు చేశారు. సూసైడ్ నోట్ లో అజయ్ ప్రస్తావించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించే పనిలో పోలీసులు ఉన్నారు.