కామారెడ్డి : బతుకు దెరువుకోసం పొట్ట చేతపట్టుకొని విదేశాలకు పయనమవుతున్న వారు పడే కష్టాలు వర్ణనాతీతం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌కు చెందిన నవీన్ దుబాయ్‌లోని ఓ కంపెనీలో పనికి చేరాడు. ఏం జరిగిందో తెలీదు కాని అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. నవీన్ చనిపోయి 13 రోజులైనా ఇప్పటికీ మృతదేహం స్వదేశానికి చేరలేదు. దీంతో కొడుకు మృతదేహం కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూనే ఉన్నారు.
ఉన్న ఊళ్లో అప్పులు తీర్చేందుకు గల్ఫ్ బాట పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కామారెడ్డి జిల్లా వాసులు. సదాశివనగర్‌కు చెందిన నవీన్.. ఐదు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ 10వేల జీతానికి కంపెనీలో పనికి చేరాడు….అప్పులు తీర్చేందుకు డబ్బులు పంపేవాడు. జనవరిలో స్వదేశానికి తిరిగి వస్తున్నానంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన నవీన్.. స్వదేశానికి చేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయాడు.
జనవరి 30న నవీన్ తన రూంలో ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడ ఉన్న స్నేహితుల ద్వారా నవీన్ తల్లిదండ్రులకు సమాచారం అందింది. త్వరలో ఇంటికి వస్తానన్న కొడుకు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నవీన్ మృతదేహం కోసం అన్న దుబాయ్ వెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో తమ కొడుకు శవం కోసం 13 రోజులుగా ఎదురుచూస్తూనే ఉన్నారు కుటుంబీకులు. పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లి చనిపోయిన తమ కొడుకు మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని బాధిత కుటుంబీకులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.