Ahmedabad Gorakhpur Express: కదులుతున్న రైల్లో యువతిపై అత్యాచారం..! సీటు ఇప్పిస్తానని టీటీఈ దురాగతం
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Ahmedabad Gorakhpur Express Representative Image (Image Credit To Original Source)
- సీటు ఇప్పిస్తానని మాయ మాటలు
- క్యాబిన్ లోకి తీసుకెళ్లి అత్యాచారం
- పరారీలో ఉన్న టీటీఈ కోసం పోలీసుల గాలింపు
Ahmedabad Gorakhpur Express: మహిళలకు రక్షణ కరువైంది. నిత్యం ఏదో ఒక చోట వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మృగాళ్లు లైంగిక దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఓ టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) దారుణానికి ఒడిగట్టాడు. కదులుతున్న రైల్లో యువతిపై అత్యాచారం చేశాడు.
అహ్మదాబాద్-గోరక్ పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ దారుణం జరిగింది. ఎన్ సీసీ క్యాడెట్ పరీక్ష రాసి వెళ్తున్న యువతిపై టీటీఈ రాహుల్ లైంగిక దాడి చేశాడు. రద్దీ ఎక్కువ ఉండటంతో ఆమె టికెట్ తీసుకోకుండా ఏసీ కోచ్ ఎక్కింది. ఆమె దగ్గరికి వచ్చిన TTE సీటు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి తన క్యాబిన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ లైంగిక దాడి చేశాడు. బాధితురాలు 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో నిందితుడు డియోరియా స్టేషన్లో దిగి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
”ఇందరా, డియోరియా స్టేషన్ల మధ్య ఈ దారుణం జరిగింది. నిందితుడిని రాహుల్ కుమార్ గా గుర్తించాం. ఘటన తర్వాత నిందితుడు పారిపోయాడు. బాధితురాలు మావు జిల్లా వాసి. గోరక్ పూర్ లో నివాసం ఉంటోంది. ఆర్మీ రిక్రూట్ మెంట్ కు ప్రిపేర్ అవుతోంది. ఎన్ సీసీ సీ సర్టిఫికెట్ ఎగ్జామ్ కోసం మావుకి వెళ్లింది. పరీక్ష రాసి తిరిగి గోరక్ పూర్ కు వస్తోంది. స్టేషన్ లో రద్దీ ఎక్కువగా ఉండటంతో బాధితురాలు టికెట్ కొనలేకపోయింది. ట్రైన్ వెళ్లిపోతోందని అలాగే ఎక్కేసింది. ఏసీ కోచ్ లోకి వెళ్లి కూర్చుంది. అదే సమయంలో టీటీఈ వచ్చాడు.
క్యాబిన్ లోకి తీసుకెళ్లి, తలుపు మూసి..
ఆమె ప్రయాణ వివరాలు, ఐడెంటిటీ గురించి ఆరా తీశాడు. టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కిందని తెలుసుకుని ఫైన్ వేశాడు. ఆ తర్వాత సీటు ఇప్పిస్తానని నమ్మబలికి ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ క్యాబిన్ లోకి యువతిని తీసుకెళ్లాడు. లోపలికి వెళ్లగానే తలుపు మూసి వేశాడు. లైంగిక దాడి చేశాడు. దీని గురించి ఎవరికైనా చెబితే టికెట్ లేని ప్రయాణం చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటానని యువతిని TTE బెదిరించాడు” అని జీఆర్ పీ పోలీసులు తెలిపారు.
అయినా బాధితురాలు భయపడలేదు. పోలీస్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ (డయల్ 112) నెంబర్ కి కాల్ చేసి లైంగిక దాడి గురించి ఫిర్యాదు చేసింది. గోరక్ పూర్ చేరుకున్న తర్వాత బాధితురాలు జీఆర్పీ పోలీస్ స్టేషన్ లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
టీటీఈ రాహుల్ బీహార్ రాష్ట్ర వాసిగా గుర్తించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. రైల్వే నిబంధనల ప్రకారం.. టిక్కెట్లు లేకుండా ప్రయాణించే ప్రయాణీకులకు TTE జరిమానా విధించి చెల్లుబాటు అయ్యే టిక్కెట్లను జారీ చేస్తారు. ఆ తర్వాత వారు తగిన కోచ్‌లో ప్రయాణించాలని నిర్దేశిస్తారు. ప్రయాణీకుడిని ప్రైవేట్ క్యాబిన్‌కు తీసుకెళ్లడం ప్రామాణిక విధానంలో భాగం కాదని రైల్వే అధికారులు తెలిపారు.
