భూ వివాదాల నేపధ్యంలో మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఒక రియల్టర్ దాయాదుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. షాద్ నగర్ లోని టీచర్స్ కాలనీలో నివాసం ఉండే కాంగ్రెస్ నేత, రియల్టర్ రామచంద్రా రెడ్డిని శుక్రవారం సాయంత్రం దాయాదులు కిడ్నార్ చేసి హత్య చేశారు. ఒక ఆస్తి వివాదం విషయంలో ఈ హత్య జరిగింది.
ఫరూఖ్ నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన రామచంద్రా రెడ్డి (55) జడ్చర్లలో నివాసం ఏర్పరుచుకుని పెట్రోల్ బంకుల నిర్వహణ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. సొంత గ్రామంలో వ్యవసాయ పొలం విషయంలో అతని దాయాదులతో గొడవలు జరుగుతున్నాయి. వాటి విషయమై ఆయన అప్పుడప్పుడు అన్నారం వెళ్లి వస్తుంటాడు. ఆ భూవివాదాలపై షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయి.
తాజాగా భూ విషయంలో మాట్లాడుకుందామని దాయాదులు చెప్పడంతో రాంచంద్రారెడ్డి మధ్యాహ్నం తన డ్రైవర్ పాషాతో కలసి , ఇన్నోవా వాహనంలో షాద్‌నగర్ పట్టణంలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే అక్కడ బైక్ పై నిరీక్షిస్తున్న దాయాదులు ప్రతాప్ రెడ్డి , అతనికారు డ్రైవర్, రామచంద్రారెడ్డి తోకలిసి ఆయన కారులో కూర్చుని భూవివాదం విషయమై మాట్లాడుకోవటం మొదలెట్టారు.
ఈ లోగా వారి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. దీంతో వారు తమ వద్ద ఉన్నకత్తులు చూపించి ఆయన్ను బెదిరించటంతో డ్రైవర్ పాషా భయపడి కారుదిగి పారిపోయాడు. వెంటనే వారు రామచంద్రా రెడ్డిని ఇన్నోవా లో కిడ్నాప్ చేసి షాద్ నగర్ బైపాస్ మీదుగా హైదరాబాద్ వైపు తీసుకు వెళ్ళారు. డ్రైవర్ పాషా ఈవిషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
షాద్ నగర్ ఏసీపీ సురేందర్ ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. సెల్ ఫోన్ ట్రాకింగ్ ఆధారంగా రామచంద్రారెడ్డి కొత్తూరు మండలంలోని పెంజర్ల శివారులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడకు చేరుకుని కారును పరిశీలించగా… కత్తి పోట్లకు గురై రామచంద్రా రెడ్డికొన ఊపిరితో ఉన్నాడు. పోలీసులు ఆయన్ను షాద్ నగర్ కమ్యునిటీ ఆస్పత్రికి తరలిస్తుండగా….మార్గ మధ్యలోనే రామచంద్రా రెడ్డి కన్నుమూశారు. రామచంద్రారెడ్డి గతంలో బాదేపల్లి సింగిల్ విండో చైర్మన్‌గా కూడా పనిచేశారు.