Russian President Vladimir Putin Survives Assassination Attempt
Vladimir Putin: 4 నెలల క్రితం రష్యా అధ్యక్షుడి వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందని, అయితే దాన్నుంచి ఆయన తప్పించుకున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా అచ్చం ఇలాంటి వార్తలే మళ్లీ వస్తున్నాయి. యూరో వీక్లీ న్యూస్ అనే మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మధ్యే పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందని, దాన్నుంచి ఆయన సేఫ్‌గా బయటపడ్డారని పేర్కొంది. అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున అరెస్ట్‌లు కూడా జరిగాయని పేర్కొన్నారు.
ఇలాంటివి గతంలో కూడా అనేకమార్లు వినిపించాయి. 2017లో అయితే ఐదుసార్లు ఆయనపై హత్యాయత్నం జరిగిందని, అయితే వాటన్నిటి నుంచి ఆయన విజయవంతంగా బయటపడ్డారని చెప్పుకున్నారు. ఇక తాజాగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి మళ్లీ ఇవి ఊపందుకున్నాయి. పుతిన్ ఆరోగ్య పరిస్థితిపై పాలనపై భద్రతపై ఇలా ఏవో ఒకటి చెబుతూనే ఉన్నారు. వీటిలో నిజాలెంత, అబద్ధాలెంత అనేది మాత్రమే ఎవరికీ పెద్దగా తెలియదు.
తాజా హత్యాయత్నం గురించి ఆస్ట్రేలియాకు చెందిన ఒక మీడియా సంస్థ కొన్ని వివరాలు ఇచ్చింది. పుతిన్ తన అధికారిక నివాసానికి తిరిగి వస్తుండగా ఆయన కాన్వాయ్‌లోని ఒక వాహనానికి అంబూలెన్స్ అడ్డు వచ్చిందట, ఇంకో వాహనం అక్కడికక్కడే చక్కర్లు కొట్టి ఆగిపోయిందట. అయితే పుతిన్ కారు మాత్రం సేఫ్‌గానే అధికారిక నివాసాన్ని చేరుకుందని పేర్కొంది. నిజానికి ఈ వార్త తమకు టెలిగ్రామ్ ద్వారా వచ్చిందని యూరో వీక్లీ న్యూస్ పేర్కొంది.
ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉన్న పుతిన్‌పై ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే కొంత ఆశ్చర్యమే కలుగుతోంది. పుతిన్ మాత్రమే కాకుండా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ విషయంలో కూడా ఇలా అనేక రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఆయా దేశాల్లో మీడియా పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండడం కారణం కాబోలు.. ఆ దేశాల నుంచి ఏ విషయం బయటికి తెలిసినా.. అంత సులువుగా నమ్మలేం.