Siya Goyal : ప్రేమ కోసం పక్కా స్కెచ్.. సోనమ్ రఘువంశీ మిస్టేక్స్ స్టడీ చేసిన సియా.. చివరికి పోలీసులకే షాక్!

Siya Goyal : కేతన్ హత్యకు ముందు సియా గోయెల్ సోనమ్ రఘువంశీ కేసును గూగుల్ సెర్చ్ చేసి బాగా స్టడీ చేసిందట.. ఆయుధాలు లేకుండా హత్య చేసి అది ప్రమాదంగా చిత్రీకరించాలని పక్కా స్కెచ్ వేసిందని పోలీసుల విచారణలో తేలింది.

Siya Goyal Researched

  • సోనమ్ చేసిన తప్పుల నుంచి నేర్చుకున్న సియా?.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు
  • క్రైమ్‌కు ముందు గూగుల్ రీసెర్చ్.. ప్రియుడితో కలిసి కొండ పైనుంచి తోసి హత్య
  • పోలీసు కస్టడీలో మహిళా ఖైదీలను కొడతారా? చట్టపరంగా హక్కులేంటని రీసెర్చ్

Siya Goyal : పుణెలో సంచలనం రేకిత్తించిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు మొదట్లో ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కనిపించగా పోలీసుల విచారణ సాగేకొద్ది పక్కా ప్లానింగ్‌తో హత్య చేసినట్టుగా తేలింది.

నిందితురాలు సియా గోయల్ తనకు కాబోయే భర్త కేతన్‌ను హతమార్చేందుకు నెలల ముందే ప్లాన్ రెడీ చేసిందని పోలీసులు వెల్లడించారు. ఆమెకు ప్రియుడు చేతన్ చౌదరి కూడా ఈ హత్యకు సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

గతంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ హత్య కేసును సియా స్ఫూర్తిగా తీసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో నిందితులు చేసిన తప్పులపై సియా రీసెర్చ్ చేసినట్లు డిజిటల్ ఫొరెన్సిక్ రిపోర్టులో బయటపడింది. ఆ కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీ చేసిన తప్పులు ఏంటి..? పోలీసులు ఎలా ఆధారాలు సేకరించారు..? అనే వివరాలను ఆమె ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఏదైనా ఆయుధం వాడితే శరీరంపై గాయాలు కనిపిస్తాయని, పోలీసులకు ఆధారాలుగా ఈజీగా దొరుకుతాయని సియా ముందే అంచనా వేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అందుకే ఎలాంటి ఆయుధాలు వాడకుండా లోహ్‌గఢ్ కోటపై నుంచి కేతన్‌ను లోయలోకి తోసేసినట్టు తెలిపారు.

Read Also : Kavitha : కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ‘టీఆర్ఎస్’ పేరుపై అభ్యంతరాలు.. ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని సూచన!

అందరికి ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలా కనిపిస్తుందని ఆమె భావించింది. ఇదంతా తాను ఒక్కదే చేయడం కుదరదని భావించి తన ప్రియుడు చేతన్ చౌదరిని రంగంలోకి దింపినట్టు పోలీసుల విచారణలో తేలింది.

షాకింగ్ విషయం ఏమిటంటే.. :
ఒకవేళ ఈ కేసులో తాను అరెస్ట్ అయితే ఎదురయ్యే పరిస్థితులకు సంబంధించి కూడా సియా ముందుగానే గూగుల్‌లో సెర్చ్ చేసింది. పోలీసు కస్టడీలో మహిళా ఖైదీలను కొడతారా?, మహిళా ఖైదీలకు చట్టపరంగా ఉన్న హక్కులు ఏంటి? వంటి అంశాలను కూడా ఆమె వెతికినట్టు మొబైల్ ఫోన్ బ్రౌజింగ్ హిస్టరీతో బయటపడింది. ఈ డిజిటల్ ఆధారాలే కేసులో కీలక సాక్ష్యాలుగా మారినట్టు పోలీసులు చెబుతున్నారు.

ఏదిఏమైనా.. చివరికి నిందితుల ప్లాన్ ఫ్లాప్ అయింది. కేతన్ చనిపోయిన ప్రదేశం పెద్దగా ప్రమాదకరంగా కనిపించడం లేదు. అది చూసిన కేతన్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడం, పోలీసులు విచారణలో సేకరించిన ఆధారాలు, మొబైల్ డేటా, చాట్ హిస్టరీ అన్నీ కలిపి అసలు కుట్రను బయటపెట్టాయి. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరూ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.