తహశీల్దార్ హత్య : ఆఫీస్ కి వెళ్లాలంటేనే భయమేస్తోంది

అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యతో రెవెన్యూ ఉద్యోగులు షాక్ కి గురయ్యారు. మహిళా ఉద్యోగిని హత్యను ఖండించారు. దారుణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతం

  • Publish Date - November 4, 2019 / 11:55 AM IST

అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యతో రెవెన్యూ ఉద్యోగులు షాక్ కి గురయ్యారు. మహిళా ఉద్యోగిని హత్యను ఖండించారు. దారుణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతం

అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యతో రెవెన్యూ ఉద్యోగులు షాక్ కి గురయ్యారు. భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. ఆఫీస్ కి వెళితే తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటామా లేదా అని టెన్షన్ పడుతున్నారు. మహిళా ఉద్యోగిని హత్యను రెవెన్యూ ఉద్యోగులు ఖండించారు. దారుణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. విజయారెడ్డి హత్యకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విజయారెడ్డి ఘటన తర్వాత ఆఫీస్ కి వెళ్లాలంటేనే భయమేస్తోందని రెవెన్యూ ఉద్యోగులు వాపోయారు. తమకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి, డీజీపీని కలుస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.

మహిళా ఉద్యోగిని హత్యపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలపాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం పిలుపునిచ్చింది.

హైదరాబాద్‌ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం జరిగింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌ విజయరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కార్యాలయంలోనే విజయారెడ్డిపై పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో రైతు సురేశ్‌ తహశీల్దార్‌ ఛాంబర్‌లోకి ప్రవేశించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తనకు తాను నిప్పంటించుకున్నాడు. తహశీల్దార్‌ను కాపాడే యత్నంలో ఇద్దరు సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన తహశీల్దార్‌ డ్రైవర్‌తో పాటు అటెండర్‌ను హయత్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.   

ఘటన అనంతరం రైతు సురేష్ కాలిన గాయాలతో బయటకు పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తహశీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఏర్పడిన తర్వాత విజయారెడ్డి తొలి తహశీల్దార్‌గా నియమితులయ్యారు. నిందితుడు గౌరెల్లికి చెందిన సురేశ్‌గా పోలీసులు గుర్తించారు. తహసీల్దార్‌ మృతి నేపథ్యలో కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దుండగుడు తహసీల్దార్‌ కార్యాలయంలోకి ఎలా ప్రవేశించాడనే అంశంపై ఆరా తీశారు. ఓ సంచితో లోపలికి ప్రవేశించినట్లు కార్యాలయ సిబ్బంది పోలీసులకు తెలిపారు.  

తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం ఘటనను కార్యాలయ సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు తహసీల్దార్‌ కార్యాలయం దగ్గరికి చేరుకుని ఆందోళనకు దిగారు. తహసీల్దార్‌ హత్యకు కారణమైన వ్యక్తిని ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని వాపోయారు.