Andhra Woman Murder Case: అమెరికాలో ఏపీ మహిళ దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 8ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ.. నిందితుడిని పట్టించిన ల్యాప్ టాప్..!

అసలు నేరస్తుడికి కోసం పోలీసులు మళ్లీ విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో సహోద్యోగి హమీద్‌తో హనుమంతరావుకు గొడవలు ఉన్నట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు.

Andhra Woman Murder Case: అమెరికాలో ఏపీ మహిళ దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 8ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ.. నిందితుడిని పట్టించిన ల్యాప్ టాప్..!

Updated On : November 19, 2025 / 10:01 PM IST

Andhra Woman Murder Case: అమెరికాలో ఏపీకి చెందిన తల్లీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఇది సరిగ్గా ఎనిమిదేళ్లు అవుతోంది. ఇప్పుడు మిస్టరీ వీడింది. అసలు నిందితుడు దొరికాడు. ఓ ల్యాప్ టాప్ నిందితుడిని పట్టించింది.

తొలుత తల్లీ కొడుకుల చావుకు మహిళ భర్తనే కారణం అని పోలీసులు అనుమానించారు. వారి విచారణలో అతడు కాదని తెలియడంతో అసలు నిందితుడి కోసం దర్యాప్తు చేపట్టారు. 8ఏళ్ల తర్వాత అసలు నిందితుడు ఎవరో తెలుసుకున్నారు. అది కూడా అతను వాడిన ల్యాప్‌టాప్‌ నుంచి సేకరించిన డీఎన్‌ఏ ద్వారా.

ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన నర్రా హనుమంతరావు తన భార్య శశికళ (40), కొడుకు అనీశ్‌ సాయి (7)తో కలిసి అమెరికాలోని న్యూజెర్సీలో ఉండే వారు. 2017 మార్చి 23న హనుమంతరావు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కొడుకు రక్తపు మడుగులో కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారిద్దరి మరణాలకు హనుమంతరావే కారణమని తొలుత అనుమానించారు. హనుమంతరావుకి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని.. ఈ క్రమంలోనే భార్యబిడ్డలను చంపేసి ఉంటాడని ఆరోపణలు రావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే, దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలంలో లభించిన డీఎన్‌ఏతో హనుమంతరావు డీఎన్‌ఏ సరిపోలేదు. దీంతో అతడిని నిర్దోషిగా విడుదల చేశారు.

అసలు నేరస్తుడికి కోసం పోలీసులు మళ్లీ విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో సహోద్యోగి హమీద్‌తో హనుమంతరావుకు గొడవలు ఉన్నట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. అతని డీఎన్‌ఏను కూడా టెస్ట్‌ చేసి అనుమానాన్ని క్లియర్‌ చేసుకోవాలని అనుకున్నారు. కానీ శశికళ హత్య జరిగిన ఆరు నెలలకు హమీద్‌ ఇండియాకు వెళ్లిపోయాడని తెలుసుకున్నారు. భారత్‌లో ఉన్న హమీద్‌ను సంప్రదించి డీఎన్‌ఏ ఇవ్వాలని అమెరికా పోలీసులు పలుసార్లు కోరారు. అందుకు హమీద్‌ ఒప్పుకోలేదు. దీంతో విచారణ ఆగిపోయింది.

హంతకుడిని పట్టించిన ల్యాప్ టాప్..

అయితే, ఎలాగైనా డీఎన్‌ఏ సేకరించి కేసును చేధించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అమెరికాలో ఉన్నప్పుడు హమీద్‌కు జారీచేసిన ల్యాప్‌టాప్‌ను పంపాలని గతేడాది అతడు పని చేసిన కాగ్నిజెంట్ సంస్థను అమెరికా కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో హమీద్ వాడిన ల్యాప్‌టాప్‌ ను కాగ్నిజెంట్ పంపింది. దాని నుంచి అధికారులు డీఎన్ఏ సేకరించి ల్యాబ్ కు పంపారు. ఘటనా స్థలంలోని లభించిన డీఎన్‌ఏతో అది మ్యాచ్‌ అయ్యింది. అంతే, హమీద్‌ అసలు హంతకుడు అని పోలీసులు తేల్చారు.

”హమీద్ చెన్నైలోని ఒక MNCలో పని చేసేవాడు. వర్క్ వీసాపై USకి వెళ్లాడు. అక్కడ న్యూజెర్సీకి చెందిన ఒక కంపెనీలో హనుమంతరావుతో కలిసి పని చేశాడు. అంతేకాదు హనుమంతరావు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోనే హమీద్ కూడా నివసించాడు. అమెరికాలో హమీద్ ఉపయోగించిన వర్క్ ల్యాప్‌టాప్ నుండి సేకరించిన DNA, హత్య జరిగిన ప్రాంతంలో లభించిన డీఎన్ఏతో సరిపోలింది” అని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

ప్రస్తుతం హమీద్‌ భారత్ లో ఉన్నాడు. దాంతో అతడిని అమెరికాకు అప్పగించాలని అక్కడి అధికారులు భారత విదేశాంగ శాఖను కోరారు. అతని ఆచూకీ తెలిసిన వారు తమకు తెలపాలని సూచించారు. కాగా, హమీద్‌ను విచారిస్తే ఈ హత్యలకు కారణాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. హనుమంతురావుపై పగ తీర్చుకోవడానికే అతడీ ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని డౌట్ పడుతున్నారు.

Also Read: బాబోయ్.. సెంట్రల్ ట్యాక్స్ ఆఫీసర్లం అంటూ.. ఏటీఎం క్యాష్ వ్యాన్ నుంచి రూ.7 కోట్లతో పరార్..