మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్, డెంటల్ కాలేజీ వెనుకున్న గబ్బిలాల పేట డంపింగ్ యార్డ్ లో సోమవారం బయటపడ్డ 3 మృతదేహాలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరిని కరీంనగర్ కి చెందిన వారుగా గుర్తించారు. వీరి మృతికి కారణాల పై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
దేశవ్యాప్తంగా మార్చి22 నుంచి లాక్ డౌన్ అమలవుతుండంగా కరీంనగర్ లో ఉండే వీరు మేడ్చల్ ఎలా వెళ్లారు..? ఎందుకు వెళ్లారు..? ఎవరు సహకరించారు..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏప్రిల్ 10వ తేదీన కొత్తపల్లి మండలం రేకుర్తిలో జరిగిన ఒక సేవా కార్యక్రమంలో పాల్గొన్న వీళ్లు ఏ కారణంతో అక్కడి దాకా వెళ్లారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
కరీంనగర్ పట్టణంలో ఇరుగు పొరుగు ఇళ్లలో నివాసం ఉంటున్న శ్రీరాముల అనూష(26), అరికెల సుమతి(29) మృతదేహాలు సోమవారం ఉదయం మేడ్చల్ జవహర్‌నగర్ పరిసరాల్లో వేలాడుతూ కనిపించగా, అనూష కూతురు ఉమామహేశ్వరి(8) టాయిలెట్స్ శుభ్రం చేసే రసాయనాలు తాగి మృతి చెంది ఉంది.
ఈ నెల 10న పేద కూలీలకు కరీంనగర్ శివారు రేకుర్తిలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగిన బియ్యం పంపిణీ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. కొద్ది రోజులుగా పేదలకు ఆహారం, నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో వీరు పాల్గొంటున్నారు. శుక్రవారం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
శనివారం ఉదయం వెళ్లిన వీరు.. ఆ తరవాత కనిపించలేదు. కాగా… అక్కడి నుంచి ఆలస్యంగా ఇంటికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు మందలించారని తెలిసింది. అదే రోజు సాయంత్రం మేడ్చల్ జవహార్‌నగర్‌కు బయలు దేరినట్లు సమాచారం.
ఖమ్మం ప్రాంతానికి చెందిన అనూషకు కరీంనగర్ కాపువాడకు చెందిన నాగరాజుతో వివాహం కాగా అదే ప్రాంతంలో నివాసం ఉండేది. ఇటీవల కొత్త ఇంటి నిర్మాణం కోసం అనుమతి ప్రయత్నాలు కొనసాగించినట్లు తెలిసింది. అనూష రెండు నెలల క్రితం హైదరాబాద్ ప్రాంతంలో ఉద్యోగం చేసినట్లు తెలిసింది.
అక్కడ పనిచేసే క్రమంలోనే జవహార్‌నగర్‌లోని గబ్బిలాలపేటలో ఒక చర్చి ఫాస్టర్ కొడుకుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే అనూష కూతురు, ఆమె స్నేహితురాలు సుమతి జవహార్‌నగర్‌కు వెళ్లడానికి కారణమైనట్లు తెలుస్తోంది.
వెల్గటూర్ మండలం అంబారిపేట గ్రామానికి చెందిన మోతె బానయ్య, నాగమ్మ కుటుంబం కొత్తపల్లి మండలం చింతకుంటలో నివాసం ఉంటోంది. వీరి కూతురు సుమతి డ్రైవర్ శ్యాంను ప్రేమ వివాహం చేసుకుంది. జ్యోతినగర్‌లో ఉండే వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు.
లాక్‌డౌన్ ఉండగా కరీంనగర్ నుంచి 160 కిలోమీటర్లు మేడ్చల్‌కు ఎలా వెళ్లారు.. ఎవరి సహకారంతో వెళ్లారు.. ఎందుకు వెళ్లారు.. అక్కడ ఏం జరిగిందనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏప్రిల్ 10వ తేదీ తర్వాత కరీంనగర్ నుంచి బయలు దేరిన వీరు ఎక్కడ ఉన్నారు. ఎవరెవర్ని కలిశారు. అనే కోణంలో పోలీసులు మృతురాళ్ల భర్తలను, అనూష స్నేహితుడితో పాటు అతడి తండ్రిని విచారిస్తున్నారు.
కాగా….మరోవైపు తమ భార్యలు కనిపించకపోవడంతో శ్యామ్, నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ లో ఆత్మహత్య చేసుకున్న మహిళలను గుర్తించిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సుమతి ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆమె సంబంధీకులు ఎవరూ రాలేదు. అనూష మరణించిందనే విషయాన్ని తెలుసుకుని ఆమె తల్లిదండ్రులు వెంకటనారాయణ, రాజేశ్వరి భద్రాది-కొత్తగూడెం జిల్లా నుంచి కరీంనగర్‌కు వచ్చారు.