మోజుతో ఏకే-47 ఎత్తుకెళ్లాడు.. యూట్యూబ్ చూసి కాల్చడం నేర్చుకున్నాడు

సిద్ధిపేట జిల్లా అక్కన్నపేటలో జరిగిన కాల్పుల ఘటనలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సదానందం గన్స్‌పై మోజుతోనే పోలీస్‌స్టేషన్‌ నుంచి ఆయుధాలు అపహరించినట్లు తెలుస్తోంది.

  • Publish Date - February 12, 2020 / 06:09 AM IST

సిద్ధిపేట జిల్లా అక్కన్నపేటలో జరిగిన కాల్పుల ఘటనలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సదానందం గన్స్‌పై మోజుతోనే పోలీస్‌స్టేషన్‌ నుంచి ఆయుధాలు అపహరించినట్లు తెలుస్తోంది.

సిద్ధిపేట జిల్లా అక్కన్నపేటలో జరిగిన కాల్పుల ఘటనలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సదానందం గన్స్‌పై మోజుతోనే పోలీస్‌స్టేషన్‌ నుంచి ఆయుధాలు అపహరించినట్లు తెలుస్తోంది. ఏకే 47ను ఎలా వాడాలో యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాడని రిమాండ్ రిపోర్ట్‌లో తేలింది. 2016 హుస్నాబాద్‌ పోలీస్‌స్టేషన్ నుంచి ఏకే 47, కార్బన్ రిఫైల్‌ మిస్‌ అవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ కేసు నమోదు చేసి ఆ తర్వాత పట్టించుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. 

గొర్రెల కాపరి ఇంట్లో మిస్సైన ఆయుధాలు లభ్యం 
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మిస్సయిన తుపాకుల ఆచూకీ మూడేళ్ల తరువాత దొరికింది. ఈ గన్స్‌ ఓ గొర్రెల కాపరి ఇంట్లో లభ్యం కావడం పోలీసుల వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. అసలా ఆయుధాలు స్టేషన్ గేట్ దాటి ఎలా బయటకు వెళ్లాయి..? ఓ సామాన్యుని ఇంట్లో ఎలా ప్రత్యక్షమయ్యాయి..? అన్న ప్రశ్నలకు పోలీసు వర్గాలు ఇంతవరకూ సమాధానం ఇవ్వడం లేదు. గన్స్ మిస్‌ అవడానికి భద్రతా వైఫల్యమే ఓ కారణమైతే.. విచారణ చేయడంలో విఫలమయ్యారంటూ పోలీస్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

అక్కన్నపేట కాల్పులతో వెలుగులోకి ఆయుధాలు 
మూడేళ్లుగా ఆచూకీ లేకుండా పోయిన ఆయుధాలు అక్కన్నపేటలో కాల్పులతో వెలుగులోకి వచ్చాయి. పక్కింటి వారితో తలెత్తిన గొడవలో సదానందం ఏకే 47తో కాల్పులు జరపాడు.  రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు సదానందాన్ని పట్టుకుని విచారించడంతో ఏకే 47, కార్బన్ గన్‌, 25 బుల్లెట్లు లభించాయి. నిందితుడి వద్ద దొరికిన ఆయుధాలు మూడేళ్ల క్రితం హుస్నాబాద్ పీఎస్‌లో మిస్సయినవేనని గుర్తించి పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

విచారణలో నిందితుడు పొంతనలేని సమాధానాలు
సదానందం కాల్పులతో మూడేళ్లుగా మిస్టరీగా మారిన వెపన్స్‌ మిస్సింగ్ కేసు ఓ కొలిక్కి వచ్చినట్టయింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. నిందితుడిని దాదాపు 20 గంటలకుపైగా విచారించినా.. అతని పొంతనలేని సమాధానాలతో పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చివరకు కేసు రీ కన్‌స్ట్రక్ట్‌ చేసిన తరువాతైనా.. ఓ నిర్ధారణకు రావొచ్చని భావించి సదానందాన్ని అక్కన్నపేటకు తీసుకెళ్లి ఆరా తీసినా లాభం కనిపించడం లేదు. సదానందం విచారణ అంతా సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్, ఇన్‌ఛార్జి సీపీ శ్వేత ముందే జరిగినా.. వారికి మాత్రం సరైన సమాచారం లభించలేదు. దీంతో నిందితుడిని కోర్టులో హాజరుపరిచి కస్టడీ పిటిషన్ వేసి మళ్లీ విచారించాలని పోలీసులు నిర్ణయించారు. హుస్నాబాద్ కోర్టులో కస్టడీ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.

ఆయుధాల కేసు విచారణలో పోలీసు అధికారుల నిర్లక్ష్యం 
ఈ ఘటనతో 2016లో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో మిస్సయిన ఆయుధాల కేసు విచారణలో పోలీసు అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. నేరం జరిగితే ఆధారం కోసం అన్ని కోణాల్లో విచారణ జరిపే పోలీసులు… తమ ఆయుధాలు మాయమైతే కేసు పెట్టి.. గన్‌మెన్‌ను వీఆర్‌కు పంపించి…అప్పటి సీఐ భూమయ్యకు ఛార్జ్ మెమో ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అంతేగానీ విచారణను ముందుకు కొనసాగించలేదు. దీంతో మూడేళ్లుగా ఆయుధాల మిస్సింగ్ కేసు పోలీసు రికార్డుల్లో అలానే మిగిలిపోయింది. 

రెండు ఆయధాలు మాయమైతే ఒక్కరిపైనే కేసేంటీ? 
అనూహ్యంగా సదానందం కాల్పులకు పాల్పడడంతో పోలీసు విభాగానికి చెందిన ఆయుధాల ఆచూకీ లభ్యమైందే తప్ప.. పోలీసుల విచారణలో మాత్రం కాదన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే సమయంలో పోలీసు అధికారులు నమోదు చేసిన కేసులో గన్‌మెన్ నరేందర్‌పై కేసు పెట్టామని చెబుతున్నారు. ఐతే.. రెండు ఆయధాలు మాయమైతే ఒక్కరిపైనే కేసు పెట్టడం ఏంటన్నది పోలీస్ అధికారులకే తెలియాలి. ఇక కానిస్టేబుల్ నరేందర్ తాను పోలీస్ స్టేషన్‌లోనే గన్‌ను ఉంచానని చెబుతున్నారు.

గన్స్‌ మిస్సైనప్పుడు స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వో ఎవరు..? 
గన్స్‌ మిస్సయినప్పుడు స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వో ఎవరు..? అతని కంట్రోల్లోనే ఠాణా ఆయుధాగారం ఉందా..? లేక మరోకరికి బాధ్యతలు అప్పగించారా..? అన్న కోణాన్ని పోలీసు అధికారులు ఎందుకు విస్మరిస్తున్నారో తెలియడం లేదు. నరేందర్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా 2016-17 సంవత్సరాల్లో విధుల్లో ఉన్న వారిని కూడా విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆయుధాల వివరాలు పోలీస్ స్టేషన్ జనరల్ డైరీలో నిత్యం అప్ డేట్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా వెపన్స్ ఇన్‌చార్జ్‌ కూడా రికార్డు మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని విచారణ చేస్తే ఎదో ఒక ఆధారం లభించి ఉండేది.

తెర వెనుకున్న దొంగ పోలీస్ ఎవరు? 
సదానందం ఒక్కడే స్టేషన్ నుంచి ఆయుధాలు ఎత్తికెళ్లినా ఎవరికీ కనిపించకుండా తీసుకెళ్లే అవకాశం లేదు. షార్ట్ వెపన్స్‌లా ఆయుధాలను పట్టుకెళ్లే అవకాశం లేదు. ఎవరో ఒకరి సహకారంతోనే నిందితుడు ఆయుధాలు ఎత్తుకెళ్లినట్లు అర్థమవుతున్నా.. తెర వెనుక ఉన్న ఆ దొంగ పోలీస్ ఎవరో తెలియాల్సి ఉంది. సదానందాన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తే అసలు నిజం బయటపడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.