తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ అదృశ్యం కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. దీప్తిశ్రీని సవతి తల్లి శాంతికుమారి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు నిర్ధారించిన
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ అదృశ్యం కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. దీప్తిశ్రీని సవతి తల్లి శాంతికుమారి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు… చిన్నారి డెడ్‌బాడీ కోసం గాలింపు జరుపుతున్నారు. దీప్తిశ్రీని హత్యచేసి ఇంద్రపాలెం దగ్గర ఉప్పుటేరులో పడవేసినట్లు పోలీసుల విచారణలో సవతి తల్లి చెప్పడంతో… ఆ ప్రాంతంలో ముమ్మర గాలింపు చేపట్టారు. ఆదివారం(నవంబర్ 24,2019) నాలుగు బోట్లతో గాలించిన ధర్మాడి బృందం… సోమవారం(నవంబర్ 25,2019) కూడా గాలింపును కొనసాగించనుంది. ఉప్పుటేరు, ఇంద్రపాలెం లాకులు దగ్గర గాలింపు జరపనుంది.
దీప్తిశ్రీని గొంతు నులిమి హత్య చేసినట్లు సవతి తల్లి శాంతికుమారి పోలీసుల విచారణలో వెల్లడించింది. దీంతో ఆమె చెప్పిన ప్రదేశాల్లో పోలీసులు గాలిస్తున్నారు. చిన్నారిని తానే చంపి గోనెసంచిలో కట్టి ఉప్పుటేరులో పడేసినట్లు శాంతికుమారి పోలీసుల ముందు తన నేరాన్ని అంగీకరించింది.
కాకినాడ నగరానికి చెందిన సత్యశ్యామ్ ప్రసాద్ కుమార్తె దీప్తిశ్రీ స్థానిక జగన్నాథపురంలోని నేతాజీ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. పాప తల్లి మూడేళ్ల క్రితం చనిపోవడంతో.. శ్యామ్ ప్రసాద్ మరో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య శాంతికుమారి, కుమారుడితో కలిసి సంజయ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. దీప్తిశ్రీ తూరంగిలోని పగడాల పేటలో మేనత్త దగ్గర ఉంటోంది. రోజు మాదిరిగానే శుక్రవారం(నవంబర్ 22,2019) పాఠశాలకు వెళ్లిన ఆ చిన్నారిని.. మధ్యాహ్న భోజన సమయంలో బడి ఆవరణలో ఆడుకుంటుండగా శాంతికుమారి కిడ్నాప్ చేసింది.
శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నేతాజీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భోజనం చేసిన దీప్తిశ్రీ.. స్నేహితులతో ఆడుకుంది. 12 గంటల 15 నిమిషాలకు ఇంటి నుండి బయల్దేరిన సవతి తల్లి శాంతికుమారి… 12 గంటల 45 నిమిషాలకు దీప్తిశ్రీ చదువుకుంటున్న స్కూల్‌కు చేరుకుంది. 12 గంటల 50 నిమిషాలకు నేతాజీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుండి మునసబు జంక్షన్ వరకు దీప్తీశ్రీని నడిపించుకుంటూ తీసుకెళ్లింది. 10 నిమిషాలకు ఓ ఆటో మారుతూ.. మధ్యాహ్నం ఒంటి గంట 45 నిమిషాలకు దీప్తీశ్రీ మెడకు టవల్ చుట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం ఆటోలు మారుతూ… చివరికి ఇంద్రపాలెం బ్రిడ్జికి చేరుకుంది. మధ్యాహ‌్నం 3 గంటలకు గోనె సంచిలో ఉన్న పాప మృతదేహాన్ని ఉప్పుటేరులో పడేసి యధావిధిగా ఇంటికి వెళ్లిపోయింది శాంతికుమారి. దీప్తిశ్రీ సాయంత్రం నాలుగున్నర అయినా ఇంటికి రాకపోవడంతో మేనత్త… తండ్రి శ్యామ్‌కు ఫోన్ చేసింది. ఎంత వెతికినా కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీప్తిశ్రీ టిక్‌టాక్ వీడియోలను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు బంధువులు. తన ముద్దు ముద్దు మాటలతో టిక్‌టాక్‌లో ఎంతోమందిని ఆకట్టుకుందని.. అలాంటి చిన్నారిని చిదిమేయడానికి సవతి తల్లికి చేతులెలా వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో కుటుంబసభ్యులనే అనుమానిస్తున్నామన్నారు డీఎస్పీ కరణం కుమార్. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని… కానీ.. నిందితులు ఎవరన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. నగరంలో కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల నిందితులను గుర్తించలేకపోతున్నామన్నారు.