బీసీ గురుకులాల్లో 4600 పోస్టులు భర్తీ

తెలంగాణలోని బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా 4600 ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.

  • Publish Date - January 25, 2019 / 03:34 AM IST

తెలంగాణలోని బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా 4600 ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.

హైదరాబాద్ : రాష్ట్రంలోని బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా 4600 ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. నూతన జోనల్‌ విధానం మేరకు తెలంగాణ గురుకుల నియామక మండలి ఈ పోస్టులను భర్తీ చేయనుంది. రానున్న 2019-20 విద్యాసంవత్సరం నుంచి కొత్తగా అందుబాటులోకి రానున్న 119 బీసీ గురుకుల పాఠశాలల పరిధిలో ఈ పోస్టులున్నాయి. తొలివిడత కింద ఈ ఏడాదిలో కనీసం 1800 పీజీటీ, టీజీటీ పోస్టులు భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది విడుదల చేసిన ప్రకటనల మేరకు టీజీటీ, పీజీటీ పోస్టులు భర్తీ చేసిన వెంటనే కొత్తవాటికి ప్రకటన వెలువరించనుంది. 

గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాంతాలను ఖరారు చేయకపోవడంతో అద్దె భవనాలు గుర్తించేందుకు అడ్డుగా మారింది. అనుకూలమైన భవనాలు దొరక్కుంటే తరగతుల సంఖ్యను తగ్గించాలన్న ఆలోచనలో ఉంది. పాఠశాలల ఏర్పాటుకు భవనాల కొరత తీవ్రంగా ఉంది. ఆరు నెలలపాటు వెతికితే కానీ  అనుకూలమైన భవనాలు అందుబాటులో ఉండటంలేదు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన పాఠశాలలు అద్దెభవనాల్లో, అరకొర సదుపాయాలతో కొనసాగుతున్నాయి. కొత్త పాఠశాలల్ని ఏర్పాటు చేసే ప్రాంతాల ప్రకటన ఆలస్యం కావడంతో, భవనాలు గుర్తించేందుకు ఇబ్బందులు తప్పేలా లేవని సంక్షేమ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త పాఠశాలల్లో తొలి ఏడాది మూడు తరగతులు ప్రారంభించాలా? ఐదో తరగతికే పరిమితం కావాలా? అనే విషయమై సందిగ్ధం నెలకొంది.