IIIT Admissions 2026 : పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. ఆరేళ్ల పాటు IIITల్లో చదివే ఛాన్స్.. నోటిఫికేషన్ విడుదల

Telangana IIIT Admissions Schedule : పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. ఐఐఐటీల్లో చేరి ఇంటిగ్రేటెడ్ పూర్తి చేసే అవకాశం కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు.

admissions schedule released RGUKT basara and mahabubnagar iiits

IIIT Admissions 2026 : పదో తరగతి విద్యార్థులకు శుభవార్త. ఐఐఐటీల్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు.. తెలంగాణ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) శుభవార్త చెప్పింది. దీని పరిధిలో ఉన్న బాసర, మహబూబ్‌నగర్ ఐఐఐటీ క్యాంపస్‌లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేశారు. 2026 సంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరేళ్ల (ఇంటర్ + బీటెక్) ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన ఈ షెడ్యూల్‌ని ఆర్జీయూకేటీ బాసర వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ శుక్రవారం విడుదల చేశారు.

ఈ నెల 16న అధికారిక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత మార్చి 18 నుంచి మే 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు సంబంధించిన అప్‌డేట్స్ తమ అధికారిక వెబ్‌సైట్ https://www.rgukt.ac.in/ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. గ్రామీణ, సామాజికంగా వెనుకబడిన విద్యార్థుల ఐఐఐటీ కలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు, నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వారికి అదనంగా 0.4 (నాలుగు శాతం) గ్రేడ్ పాయింట్లు/మార్కులు కలుపుతారు.

ముఖ్యమైన తేదీలు:

  • నోటిఫికేషన్ విడుదల: మార్చి 16.
  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: మార్చి 18.
  • దరఖాస్తుకు లాస్ట్ డేట్: మే 10.
  • తొలి విడత జాబితా విడుదల: మే 30.
  • తొలి విడత కౌన్సెలింగ్: జూన్ 5.

ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 30న విడుదల చేస్తారు. మొదటి విడత కౌన్సెలింగ్ జూన్ 5న నిర్వహించేందుకు తాత్కాలికంగా నిర్ణయించినట్లు ప్రకటించారు. ఆసక్తి కలిగిన అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.