హైదరాబాద్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి. 27 వ తేదీన ప్రథమ, 28 వ తేదీన ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభంకానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 3 లక్షల 91 వేల 48 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో లక్షా 90 వేల 475 మంది ప్రథమ సంవత్సరం, 2 లక్షల 573 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. మూడు జిల్లాల పరిధిలో 441 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మాస్ కాపీయింగ్ జరుగకుండా గట్టి బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతోపాటు పరీక్ష కేంద్రానికి సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ బోర్టు నుంచి ఇప్పటికే ప్రశ్నాపత్రాలు జిల్లాలోని బోర్డు అధికారుల కార్యాలయాలకు చేరుకున్నాయి. వీటిని స్టోరేజీ స్పాట్స్, స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచారు. పరీక్ష నిర్వహించే సమయానికి అర్ధగంట ముందు ప్రశ్నాపత్రాలను సెంటర్ కు చేరవేయనున్నారు. ప్రశ్నాపత్రం కోడ్ సీరిస్ ను అధికారింగా ప్రకటించిన తర్వాత పరీక్ష కేంద్రంలోని సీసీ కెమెరాల నిఘాలో బండిల్స్ ను ఓపెన్ చేసి, ఆ తర్వాత విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జలమండలి మంచినీరు సరఫరా చేస్తుంది. ప్రతి క్లాస్ రూమ్ లోనూ విధిగా మంచినీటి కుండను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే తక్షణ వైద్య సేవలు అందించేందుకు పరీక్ష కేంద్రాల్లో ఒక ఏఎన్ ఎమ్ చొప్పున అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు సహా ప్రాథమిక వైద్యానికి అవసరమైన మందులు సరఫరా చేయనున్నారు.
అభ్యర్థుల హాల్ టికెట్లు ఇప్పటికే ఆయా కాలేజీలకు పంపించారు. కొంతమంది ఫీజులు చెల్లించని వారికి హాల్ టికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు నిరాకరించి, క్షోభకు గురిచేస్తుండంపై ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యాలతో సంబంధం లేకుండా హాల్ టికెట్ పొందే అవకాశాన్ని ఇంటర్ బోర్డు విద్యార్థులకు కల్పిస్తోంది. ఫిబ్రవరి 25, 26 వ తేదీల్లో విద్యార్థుల హాల్ టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది. అభ్యర్థులు నేరుగా తమ హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకొని పరీక్షకు హాజరు కావొచ్చని ప్రకటించింది. విద్యార్థులను గంట ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమంతిచనున్నారు. 9 గంటల తర్వాత వచ్చే అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులు నేరుగా పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు వీలుగా సెంటర్ లొకేటర్ యాప్ ను రూపొందించినట్లు ప్రకటించింది. అభ్యర్థులు ప్లేస్టోర్ నుంచి ’టీఎస్ బీఐఈ సెంటర్ లొకేటర్ 2019’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు, ఇందులో హాల్ టికెట్ ఎంట్రీ చేస్తే అభ్యర్థి పేరు, సెంటర్ పేరు, దూరం తదితర వివరాలు తెలియచేస్తుంది.