ESIC MBBS Seats 2026 : ఆ విద్యార్థులకు బంపరాఫర్.. MBBS ఫీజు ఏడాదికి రూ.24 వేలు మాత్రమే.. అస్సలు మిస్ చేసుకోకండి..
ESIC MBBS Seats 2026 : నెలకు రూ.2 వేల ఖర్చుతో ఎంబీబీఎస్ పూర్తి చేసేందుకు అవకాశం లభిస్తుంది.
- Dharani Pilli
- Updated on- May 3, 2026 / 03:48 PM IST
esic offers mbbs for rs 24000 per year for workers children in esi medical colleges
ESIC MBBS Seats 2026 : ఎంబీబీఎస్ చదవాలంటే.. ఎంత ఫ్రీ సీటు వచ్చినా సరే లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రతిభ ఉన్నప్పటికీ చాలా మంది పేద విద్యార్థులు.. ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య విద్య గురించి ఆలోచించరు. అలాంటి వారందరికి ఇది పండగలాంటి వార్త. ఏడాదికి కేవలం రూ. 24 వేల ఫీజుతో ఎంబీబీఎస్ చదువుకోవచ్చు. అంటే నెలకు రూ. 2 వేలు అన్నమాట. మరి ఇంత తక్కువ ఫీజుకు ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం కల్పిస్తున్న కాలేజీ ఏదంటే.. ఈఎస్‌ఐసీ.
ఈఎస్‌ఐసీ.. దేశవ్యాప్తంగా తక్కువ వేతనం పొందుతూ.. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఈఎస్ఐ పరిధిలో పూర్తి ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలానే ఈఎస్‌ఐసీ.. సొంతంగా దేశవ్యాప్తంగా 19 వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులను నిర్వహిస్తోంది. ఈక్రమంలో ఈఎస్‌ఐసీ వైద్య, డెంటల్, నర్సింగ్ కాలేజీల్లో కార్మికుల పిల్లలకు ప్రత్యేకంగా 695 సీట్లు కేటాయిస్తోంది. ఈ కాలేజీల్లో సీటు పొందితే నెలకు రూ. 2 వేల ఖర్చుతో సంవత్సరానికి 24 వేల రూపాయల్లో ఎంబీబీఎస్ చదవచ్చు.
అర్హులు..
నెలకు రూ. 21 వేలలోపు వేతనం పొందుతున్న కార్మికుల పిల్లలు దీనికి అర్హులు. తెలంగాణకు సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ బోధనాసుపత్రిలో 52 సీట్లు ఉన్నాయి. అయితే ఈ కోటా కింద అర్హత పొందాలంటే.. ‘వార్డ్ ఆఫ్ ఐపీ’ సర్టిఫికెట్ కీలకం.
మూడు రకాల కోటాలు…
ఈఎస్‌ఐసీ వైద్య కాలేజీల్లో మూడు కోటాలు ఉంటాయి. దీని ప్రకారం కాలేజీకి కేటాయించిన మొత్తం సీట్లలో
- 50 శాతం సీట్లను ఆ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు మెరిట్ ప్రకారం కౌన్సెలింగ్‌లో కేటాయిస్తారు.
- ఆ తర్వాత 15 శాతం సీట్లకు ఆలిండియా కోటా కింద ఎవరైనా పోటీపడవచ్చు.
- ఇక మిగతా 35 శాతం సీట్లను ఐపీ కోటాకు ఇస్తారు.
- ఈ కోటా సీట్లకు ఫీజు రూ. 24 వేలు మాత్రమే.
మిగతా కోటా కింద సీట్లు పొందిన విద్యార్థులు మాత్రం.. ప్రతి ఏడాదికి రూ. లక్ష చొప్పున చెల్లించాలి. వీటితోపాటు యూనివర్సిటీ నిర్దేశించిన ఛార్జీలు, కాలేజీ సెక్యూరిటీ డిపాజిట్, హాస్టల్ ఛార్జీలు, మెస్ డిపాజిట్, మెస్ ఛార్జీలు వంటి ఇతర ఖర్చు కూడా ఉంటాయి.
వీరంతా దరఖాస్తు చేసుకోవచ్చు..
ఈఎస్‌ఐసీ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలు ఈ సీట్లు పొందడానికి అర్హులు. వారు నీట్ (యూజీ)-2026 పరీక్షకు దరఖాస్తు చేసి ఉండాలి. ఉద్యోగంలో గాయాల కారణంగా వైకల్యం పొందిన, చనిపోయిన కార్మికులపై ఆధారపడిన పిల్లలు సైతం ఈ కోటా ద్వారా కేటాయించిన సీట్లు పొందడానికి అర్హులు.
దరఖాస్తులకు చివరి తేదీ
2026-27 ఏడాదికి ఐపీ సీట్లు పొందేందుకు అర్హులైన కార్మికుల పిల్లలు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం…
- విద్యార్థులు ముందుగా ఈఎస్‌ఐసీ పోర్టల్‌లోని ‘అప్లై ఫర్ వార్డు ఆఫ్ ఐపీ సర్టిఫికెట్’ లింకుపై క్లిక్ చేయాలి.
- అక్కడ అడిగిన వివరాలన్నీ నమోదు చేయాలి.
- ఈఎస్‌ఐసీ డేటాబేస్‌లో నమోదైన కార్మికుడి ఫోన్ నంబరుకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- విద్యార్థి, కార్మికుడి ఫొటోలు, పుట్టిన తేదీ, నీట్ అడ్మిట్ కార్డు ఇతర వివరాలను ఎంటర్ చేయాలి.
- అలానే పైన పేర్కొన్న పత్రాల కాపీలు అప్‌లోడ్ చేయాలి.
- విద్యార్థినులు నిబంధనల ప్రకారం అఫిడవిట్ సమర్పించాలి.
- ఈ వివరాలను పరిశీలించాక ఈఎస్‌ఐసీ ప్రాంతీయ కార్యాలయ అధికారులు దరఖాస్తును ఆమోదిస్తారు.
- ఆ వెంటనే ఐపీ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ఈ సర్టిఫికెట్ పొందిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాలి.
- ఎగ్జామ్ లో వచ్చిన ర్యాంకు, మెరిట్, విద్యార్థి ఆప్షన్లు, రిజర్వేషన్ల కేటగిరీ ఆధారంగా సీట్లు లభిస్తాయి.
