Top AI Courses : లేఆఫ్స్ గురించి భయపడకండి.. ఈ AI కోర్సులు నేర్చుకుంటే ఇక మీకు తిరుగుండదు.. లక్షల్లో ప్యాకేజీ..
Top AI Courses : లేఆఫ్స్ పేరుగుతున్న తరుణంలో జాబ్ మార్కెట్ నిపుణులు కొన్ని ఏఐ కోర్సులు నేర్చుకోవాలని సూచిస్తున్నారు.
- Dharani Pilli
- Updated on- May 24, 2026 / 08:19 PM IST
experts suggest top ai courses to learn for high paying jobs
Top AI Courses : ప్రస్తుతం ఒక్క రంగం అనే తేడా లేదు.. ప్రతి చోటా ఉద్యోగుల తొలగింపు సర్వసాధారణంగా మారింది. ప్రతి రంగంలో ఏఐ (AI) వల్ల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. దిగ్గజ టెక్ కంపెనీల్లో కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు సెక్టార్ లో పని చేస్తున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడు తమ ఉద్యోగాలు పోతాయో అని భయపడుతున్నారు. ఈ క్రమంలో నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. ఫ్రెషర్స్ మాత్రమే కాకుండా ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న వారు కొన్ని ఏఐ కోర్సులు నేర్చుకుంటే.. లేఆఫ్స్ గురించి భయపడనవసరం లేదంటున్నారు. పైగా ఈ కోర్సులు నేర్చుకుంటే.. లక్షల్లో జీతాలు పొందవచ్చని చెబుతున్నారు.
ప్రస్తుతం సమాజంలో ఏఐ బూమ్ నడుస్తోంది. అందుకే ఇప్పుడు ఇది మంచి కెరీర్ ఆప్షన్ గా కూడా మారింది. ఫ్రెషర్స్ సహా ఇప్పటికే జాబ్స్ చేస్తున్న వారు కూడా సరైన ఏఐ కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరి అలాంటి కోర్సులు ఏవి.. వాటికి జీతాలు ఎంత ఉంటాయి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
మెషిన్ లెర్నింగ్ (Machine Learning)
ఈ మెషిన్ లెర్నింగ్ కోర్సు ఫీజు 25,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ కోర్సు నేర్చుకునే ఇన్స్టిట్యూట్, కోర్స్ కాల వ్యవధిని బట్టి, ట్రైనింగ్ ఆధారంగా ఈ లెక్కలు మారొచ్చు. ఈ కోర్సు నేర్చుకుంటే ఫ్రెషర్స్ లేదా ఎంట్రీ లెవెల్ ఇంజనీర్లకు ఏడాదికి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ప్యాకేజీ లభించే అవకాశం ఉంటుంది. ఈ కోర్సు నేర్చుకునే మిడ్ లెవెల్ సీనియర్స్ కు 12 లక్షల నుంచి 40 లక్షల రూపాయల ప్యాకేజీ దక్కే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
డీప్ లెర్నింగ్ (Deep Learning)
ఈ డీప్ లెర్నింగ్ కోర్సు ఫీజు.. ఇన్స్టిట్యూట్ కోర్స్, కాల వ్యవధిని బట్టి కనీసం 20,000 నుంచి 3.50 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేశాక జాబ్ లో చేరితే.. శాలరీ ఏడాదికి 6 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ ప్యాకేజీ కూడా లభించవచ్చని జాబ్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
పైథాన్ కోడింగ్ (Python Coding)
ఇది డైరెక్ట్ ఏఐ కోర్స్ కాకపోయినా ఏఐ కోర్సులకు పునాది లాంటిది. దీనికి ఫీజు 8,000 నుంచి 30,000 రూపాయల వరకు ఉంటుంది. మార్కెట్ నిపుణుల ప్రకారం ఈ కోర్సులు చేసిన తర్వాత ఫ్రెషర్ కు ఏడాదికి 3,50,000 రూపాయల నుంచి 6 లక్షల వరకు లభిస్తుంది. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ డేటా సైన్స్, ఏఐఎమ్‌ఎల్ (AI/ML) స్పెషలైజేషన్స్ చేస్తే 15 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది.
నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (Natural Language Processing – NLP)
ఏఐ లో నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్‌ఎల్‌పీ) అనేది కంప్యూటర్లు.. మానవుల భాషను అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి ఉపయోగపడే టెక్నాలజీ. ఈ కోర్సు నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూట్ డ్యూరేషన్ ని బట్టి 3.50 లక్షల రూపాయల వరకు ఖర్చువుతుంది. అయితే ఈ కోర్సు నేర్చుకునే వారికి జాబ్ మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం ఈ క్వాలిఫికేషన్ తో ఫ్రెషర్స్ కు 4 లక్షల నుంచి 8 లక్షల రూపాయల వరకు శాలరీ ఉంటుంది. అదే సీనియర్ ఇంజనీర్లకు 25 నుంచి 40 లక్షల రూపాయల శాలరీ కూడా కంపెనీలు ఆఫర్ చేస్తాయి.
ఇవే కాక ఇంకా కొన్ని డిమాండ్ ఉన్న ఏఐ కోర్సులు కూడా ఉన్నాయి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఈ కోర్సులను నేర్చుకుంటే.. లేఆఫ్స్ గురించి భయం లేదు. మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు పొందవచ్చు.
